మన దేశంలో సామాన్య కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రి ఖర్చులు చాలా వరకు సొంతంగా భరించాల్సిందే. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆరోగ్య సంబంధిత ఖర్చుల కోసం అధిక భాగం ప్రభుత్వం నుంచి సాయం లభిస్తుంది. ఇదే విషయాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజా నివేదిక నొక్కి చెప్పింది.
'స్టేట్ ఫినాన్స్: ఏ స్డడీ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2020-21' పేరుతో విడుదలైన ఈ నివేదికలో.. ప్రస్తుతం దేశంలో వైద్య రంగంలో ప్రైవేటు హెల్త్‌కేర్ ప్రొవైడర్లే అధికంగా ఖర్చు చేస్తున్నారని వివరించింది. అది కూడా మధ్య తరగతి కుటుంబాలు తమ జేబు నుంచి ఖర్చు చేస్తేనే వారికి ఈ సహాయం లభిస్తుందని పేర్కొంది.
నేషనల్ హెల్త్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రకారం.. 2016-17 ఆరోగ్య వ్యయాల్లో దేశ సగటు సొంత ఖర్చు 58.7 శాతంగా ఉన్నట్లు తేలింది.
అంతర్జాతీయంగా ఇలా..
అంతర్జాతీయంగా చూస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో.. తూర్పు ఆసియా, అమెరికా, పశ్చిమ ఐరోపాలో ప్రస్తుత హెల్త్‌కేర్ వ్యయాలు అధిక స్థాయిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. అయితే అందులో అధిక మొత్తం ప్రభుత్వ ఫినాన్సింగ్ వాటానే కావడం గమనార్హం.
"ఆయా దేశాల్లో హెల్త్‌కేర్ కోసం సగటు కుటుంబాలు చాలా తక్కువగా ఖర్చు చేస్తుంటాయి. ఆరోగ్య వ్యయాల్లో అధిక భాగం ప్రభుత్వ పథకాలు, తప్పనిసరి సహాయక ఆరోగ్య బీమాల నుంచి అందుతుంది" అని నివేదిక తెలిపింది.
ప్రస్తుతం దేశంలో ఆరోగ్య వ్యయాలు.. స్థాయి, ఫినాన్సింగ్ పరంగా దక్షిణాసియా అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్), అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ నేషన్స్ (ఏఎస్ఈఏఎన్) దేశాలకు దాదాపు సమానంగా ఉన్నాయి. అయితే శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల్లో మాత్రం ప్రభుత్వ ఫినాన్సింగ్ వాటా అధికంగా ఉంటుందని నివేదిక వివరించింది.
చైనా, రష్యాలోనూ హెల్త్‌కేర్ వ్యయాలు భారత్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే... ఈ దేశాల్లో హెల్త్ కేర్ ప్రభుత్వ వ్యయాల వాటా బీమాలదేనని నివేదిక వెల్లడించింది.
రాష్ట్రాల వారీగా..
రాష్ట్రాల వారీగా చూస్తే భారత్‌లో.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్లో.. ప్రభుత్వ హెల్త్‌కేర్ వ్యయాలు దారుణమైన స్థాయిలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో సగటు కుటుంబానికి ఆరోగ్య పరమైన ఖర్చుల కోసం సొంత జేబుకు చిల్లు పడాల్సిందేనని తెలిపింది.
మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం హెల్త్‌కేర్ విభాగంలో ప్రభుత్వ ఫినాన్సింగ్ వాటా కాస్త మెరుగ్గా ఉన్నట్లు నివేదిక వివరించింది.
ఇదీ చూడండి:గ్రామీణ బ్యాంకులకు కేంద్రం పెట్టుబడి సాయం