ప్రభుత్వం ఇప్పట్లో రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి స్వామినాథన్ తెలిపారు. కరోనా సంక్షోభం వీడిన తర్వాతే తదుపరి ఉద్దీపన చర్యలపై ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కరోనా సాయం కింద ప్రత్యక్ష నగదు బదిలీ చేసినా... 40 శాతం లబ్ధిదారులు ఆ మొత్తాన్ని ఖర్చు చేయలేదని ప్రభుత్వం గుర్తించిందని వెల్లడించారు స్వామినాథన్. ఇది ఉద్దీపనల అందజేతపై చర్చకు దారి తీసిందని, అందువల్ల మరోసారి ప్యాకేజీ ఏ సమయంలో ప్రకటించాలన్న అంశం కీలకంగా మారిందని వివరించారు.
అప్పుడే సాధ్యం..
కేవలం ఉద్దీపన ప్యాకేజీలతోనే పరిస్థితులు మెరుగయ్యే అవకాశం లేదని స్వామినాథన్ అన్నారు. ప్రజలు తమంతటతాము ముందుకొచ్చే వరకు సాధారణ పరిస్థితులు ఏర్పడవని తెలిపారు. అందుకు ప్రజల్లో కరోనా భయాలు తొలగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఆర్థిక ఉద్దీపనలు ఫలితాన్నిస్తాయని పేర్కొన్నారు.
జీడీపీలో 2 శాతం..
ప్రభుత్వం మొదటి ఉద్దీపన ప్యాకేజీని ఈ ఏడాది మార్చి చివర్లో ప్రకటించింది. జీడీపీలో దాదాపు 2 శాతం అదనంగా ఇందుకు ఖర్చు చేసింది. ఆర్బీఐ కూడా రెండు సార్లు వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఇప్పుడు వడ్డీ రేట్లను అదే స్థాయిలో పెంచాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గినా జోరుగా ఆదాయం