2021-22లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం గడించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇందుకోసం రెండు బ్యాంకులు, ఓ బీమా సంస్థ సహా వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రైవేటీకరించనున్న కంపెనీలివే..
ఐడీబీఐ బ్యాంక్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సహా పలు ఇతర కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణను 2021-22లో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ను 2021-22లో ఐపీఓకు తేనున్నట్లు తెలిపారు సీతారామన్.
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణకు తదుపరి జాబీతాపై కసరత్తు చేయాలని నీతి ఆయోగ్‌ను కోరుతున్నట్లు నిర్మల వెల్లడించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల మూసివేతకు నూతన యంత్రాంగాన్ని నెలకొల్పేందుకు కసరత్తు జోరుగుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రాష్ట్రాల వాటా విక్రయానికి ప్రత్యేక ప్యాకేజీని తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'బీమా సంస్థల్లో 74శాతానికి ఎఫ్‌డీఐలు'