90వ దశకంలో దివాళా దిశలో ఉన్న దేశాన్ని ముందుకు నడిపించిన.. పీవీ-మన్మోహన్ ఆర్థిక ఫార్ములా మరోసారి అవసరం అవుతోందని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సూచించారు. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిలా నిలిచిన పీవీ-మన్మోహన్ ఆర్థిక విధానం.. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో నడిపించగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
1991లో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనావస్థలో ఉన్న దశలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు.. అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌తో కలిసి.. సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. ఇది మన ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పుగా చెప్పుకుంటారు. అదే స్ఫూర్తితో మరింత సమర్థమైన నిర్ణయాలు తీసుకోవాలని.. ప్రముఖ జాతీయ దినపత్రిక 'ది హిందూ'కు రాసిన ఓ వ్యాసంలో ప్రభాకర్ పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం.. పాత విధానాలు
భాజపా (నెహ్రూ విధానాలు) వద్దు.. వద్దంటుందే కానీ.. తమదంటూ సొంత ఆర్థిక విధానాన్ని రూపొందించుకోలేకపోయిందని పేర్కొన్నారు. కీలకరంగాలు దెబ్బతింటున్నాయని సంకేతాలు వస్తోన్న తరుణంలో ఇప్పటికీ పూర్తి సమాచారాన్ని వెల్లడించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన ఆక్షేపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు ఓ బలమైన నాయకుడు ముందుకు రావాల్సి ఉందన్నారు.
ఆర్థికమంత్రి స్పందన
పరకాల ప్రభాకర్ ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ భర్త కావడం వల్ల సహజంగానే ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవాళ దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పాత్రికేయులు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు నిర్మల నేరుగా సమాధానం ఇవ్వలేదు. 2014 నుంచి 2019 వరకూ తమ ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చిందో వివరించారు. జీఎస్టీ, బ్యాంకింగ్ సంస్కరణలు, ఆధార్ అనుసంధానం వంటివి సామాన్యమైన విషయాలేమీ కావు అన్నారు.