దేశ వృద్ధిరేటును పరుగులెత్తించి, 2025కు మన ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాలంటే రూ.111 లక్షల కోట్లతో సరికొత్త మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రస్తుతం ఉన్న వాటిని మెరుగు పరచాలని ఆర్థిక శాఖ నెలకొల్పిన టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 'భారత్‌లో తయారీ ' అత్యంత కీలకమని, ఇందుకు మౌలిక వసతులు ఎంతో ముఖ్యమని వివరించింది.
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ ఈ నివేదికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందచేసింది. మౌలికం మెరుగైతే వృద్ధిరేటు పరుగుదీయడం ఖాయమని పేర్కొంది. కరోనా వైరస్ సంక్షోభం నుంచి కోలుకుని, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం ఆరంభమవుతుందని నివేదిక అంచనా వేసింది. 2025 వరకు వృద్ధిరేటు పెరిగేందుకు జీఎస్‌టీ, దివాలా స్మృతి వంటి సంస్కరణలు తోడ్పడతాయని వివరించింది.
ఇవీ లాభాలు
- మౌలిక వసతుల కోసం కార్మికులు అధికంగా అవసరమవుతారు. ఇందువల్ల కొత్త ఉద్యోగాలు భారీగా ఏర్పడతాయి. లాజిస్టిక్స్, నెట్‌వర్క్‌లు మెరుగుపడి, దేశీయ సామర్థ్యం ఇనుమడిస్తుంది.
- మరిన్ని పెట్టుబడులు, ఫలితంగా ఉపాధి పొందేవారు అధికమైతే, దేశీయ గిరాకీ పెరుగుతుంది.
ఇవి సాకారం అయ్యేందుకు..
- 2025 కల్లా లక్ష్యాన్ని వేగంగా చేరేందుకు బాండ్ మార్కెట్లలో సంస్కరణలు కావాలి. భూమిని సద్వినియోగం చేయడం సహా ఆర్థికాభివృద్ధికి తోడ్పడే సంస్థలు నెలకొల్పాలి.
- మౌలిక ప్రాజెక్టుల పర్యవేక్షణ, అమలు, నిధులు సమకూర్చేందుకు 3 కమిటీలు ఏర్పాటు చేయాలి.
రూ.111 లక్షల కోట్లలో..
- నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) కింద రూపొందించిన ఈ ప్రణాళికలో రూ.44 లక్షల కోట్ల పథకాలు (40 శాతం) ఇప్పటికే అమలులో ఉన్నాయి. రూ.33 లక్షల కోట్ల (30 శాతం) విలువైనవి అమలుకు సిద్ధమవుతున్నాయి. రూ.22 లక్షల కోట్ల (20 శాతం) పనులు రూపకల్పన జరగాల్సి ఉంది. మరో రూ.11 లక్షల కోట్లవి ఇంకా చేపట్టలేదు.
- ఇంధనం (24 శాతం), రోడ్లు (18 శాతం), పట్టణాల్లో (17 శాతం), రైల్వేల్లో (12 శాతం) వసతులు ఏర్పడతాయి.
- కేంద్రప్రభుత్వం 39 శాతం, రాష్ట్రాలు 40 శాతం, ప్రైవేటు రంగం 21 శాతం వాటా వహించాలన్నది ప్రణాళిక.