చేతిలో డబ్బు లేకపోయినా.. అవసరమైన కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కార్డును వాడేవారందరికీ ఇది తెలిసిందే. దీని అవసరం ఎలా ఉన్నా... జాగ్రత్తగా వాడకపోతే అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేసేదీ ఇదే. తమ కొనుగోలు శక్తికి ఇదొక అదనపు బలంగా భావించడం, నగదు వాపసు, రివార్డు పాయింట్ల కోసం అవసరం లేకపోయినా కార్డును వాడితే.. ఇబ్బందులు తప్పవు. అందుకే, దీన్ని వాడేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.. ఒకవేళ సమయానికి బిల్లు చెల్లించలేకపోతే.. ఏం చేయాలి..
కార్డు వాడి, సమయానికి బిల్లు చెల్లిస్తే.. చిక్కులేమీ ఉండవు. చెల్లింపు సామర్థ్యానికి మించి కొని, తీరా బిల్లు చెల్లించే వ్యవధిని మీరితేనే అసలు సమస్య. రుసుములతోపాటు, వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ బిల్లు మొత్తం పెరుగుతూనే ఉంటుంది. ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటే ఆ ప్రభావం రుణ చరిత్రపైనా.. క్రెడిట్ స్కోరుపైనా పడుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో చేసే నాలుగు ప్రధాన పొరపాట్లు... వాటిని ఎలా అధిగమించాలనేది కార్డుదారులందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.
బదిలీ చేస్తున్నారా?
ఒక క్రెడిట్ కార్డుకు చెల్లించాల్సిన బిల్లును మరొక కార్డుకు బదిలీ చేసుకునే వీలుంటుంది. కొన్నిసార్లు పూర్తి ఉచితంగానూ, లేదా చాలా తక్కువ రుసుములతో ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఇలాంటప్పుడు కొన్నిసార్లు 2-6 నెలల పాటు బిల్లు చెల్లించకుండా ఉండే అవకాశం లభిస్తుంది. కార్డు సంస్థల నిబంధనలను బట్టి, ఈ వ్యవధి ఆధారపడుతుంది. దీనివల్ల కార్డుదారులకు బిల్లు చెల్లించేందుకు కొంత గడువు దొరికినట్లవుతుంది. ఆ సమయంలో అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలు కలుగుతుంది. ఒకసారి ఈ వ్యవధి ముగిస్తే.. మీరు బ్యాలెన్స్ బదిలీ చేసిన కార్డు సంస్థ వడ్డీని విధించే అవకాశం ఉంది. చాలా కార్డు సంస్థలు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ మొత్తాన్ని ఈఎంఐలుగా మార్చుకునే సౌకర్యాన్నీ కల్పిస్తున్నాయి. వ్యవధి సాధారణంగా 3-48 నెలల మధ్య ఉంటుంది. బిల్లు చెల్లింపులో ఇబ్బంది ఎదురైనప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే దీన్ని ఎంచుకోవాలి. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఆ బిల్లునూ వీలైనంత తొందరగా చెల్లించేందుకు ప్రయత్నించాలి.
వాయిదాల్లోకి మార్చేస్తే...
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు.. ఆ బిల్లును నెలవారీ వాయిదాల్లోకి మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంటాయి కార్డు సంస్థలు. బిల్లు చెల్లించనప్పుడు విధించే వార్షిక వడ్డీ 18 శాతం నుంచి 49.36 శాతం వరకూ ఉంటుంది. అదే.. ఈ బాకీని వాయిదాల్లోకి మారిస్తే.. వడ్డీ శాతం 12-24 శాతం మధ్యలో ఉంటుంది. బాకీ చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఈఎంఐలోకి మార్చుకోవడం ఒక మార్గం. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ఇలా వాయిదాల్లోకి మార్చుకున్న మొత్తాన్ని కార్డు సంస్థ నిబంధనలను బట్టి, 3-48 నెలల్లో తీర్చేందుకు వీలవుతుంది. నెలకు ఎంత మొత్తం చెల్లించగలం అనేది ఆధారంగా చేసుకొని, వాయిదా మొత్తాన్ని నిర్ణయించుకోండి.
రుణం తీసుకొని..
క్రెడిట్ కార్డు రుణాలతో పోలిస్తే.. వ్యక్తిగత, బంగారం రుణాలకు వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉంటుంది. క్రెడిట్ కార్డు బాకీపై విధించే వడ్డీ 18-49.36శాతం వరకూ ఉండగా.. వ్యక్తిగత రుణంపై 9.95-24శాతం వరకూ వడ్డీ విధిస్తారు. వ్యక్తిగత రుణాలను ఎలాంటి హామీ లేకుండానే ఇస్తారు. కాబట్టి, వీటిని మంజూరు చేసేటప్పుడు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరు, నెల ఆదాయం, ఉద్యోగం తీరు, వయసులాంటివి పరిశీలిస్తారు. వ్యక్తిగత రుణం దాదాపు ఐదేళ్ల వ్యవధితో లభిస్తుంది. ఒకవేళ అర్హతలు సరిపోక వ్యక్తిగత రుణం ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తే.. బంగారాన్ని తాకట్టు పెట్టి, రుణం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది హామీతో ఉండే అప్పు కాబట్టి, వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. గృహరుణం ఉన్నవారు టాపప్ లోన్ తీసుకోవడం ద్వారా కాస్త నిధులను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.
పెట్టుబడులు వెనక్కి తీసుకోండి..
కొన్ని పెట్టుబడుల మీద వచ్చే రాబడి మీరు క్రెడిట్ కార్డు బిల్లు వడ్డీకి చెల్లించే మొత్తం కన్నా చాలా తక్కువగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఒకపక్క అధిక వడ్డీలు చెల్లిస్తూ.. తక్కువ రాబడి వచ్చే వాటిల్లో డబ్బును మదుపు చేయడం సరికాదు. ఉదాహరణకు స్థిరాదాయం ఇచ్చే పథకాలు, బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న నిల్వ, బాండ్లు, డెట్ ఫండ్లులాంటి వాటిల్లో తక్కువ వడ్డీ వస్తుంది. ఇలాంటి వాటిల్లో ఉన్న డబ్బును అధిక వడ్డీ వసూలు చేసే క్రెడిట్ కార్డు బాకీలు తీర్చడానికి ఉపయోగించండి. అత్యవసర నిధి అవసరాల కోసం కేటాయించిన మొత్తాన్ని దీనికోసం ముట్టుకోకండి. దీనికి ప్రత్యామ్నాయంగా తప్పదు అనుకుంటే.. కొత్తగా రుణం తీసుకోవడమో.. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను ప్రయత్నించడంలాంటి విషయాల్ని పరిశీలించాలి.
- నవీన్ కుక్రేజా, సీఈఓ, పైసాబజార్డాక్కాం
ఇదీ చూడండి:మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోండి: ఎస్‌బీఐ