భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ల కారణంగా ఏప్రిల్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఇది తొలి త్రైమాసిక జీడీపీని కొంత మేర దెబ్బతీయవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ అంచనా వేసింది. రియల్ టైంలో ఆర్థిక కార్యకలాపాలను లెక్క వేసే 'యూబీఎస్ ఇండియా యాక్టివిటీ ఇండికేటర్' గత నెలలో 7 పర్సంటేజీ పాయింట్లు తగ్గి 95కు చేరింది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న మార్చి 2020లో ఇది 12 శాతం; ఏప్రిల్ 2020లో 25.5 శాతం తగ్గింది. అప్పట్లో మొత్తం కేసులు 25,000 కూడా లేవు. ఇపుడు 2 కోట్లను అధిగమించాయి.
2020తో పోలిస్తే ప్రభావం తక్కువే
కాగా, ఈ నెలలో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను ప్రారంభించిన నేపథ్యంలో కార్యకలాపాల స్థాయి మరింత బలహీనపడవచ్చని యూబీఎస్ అంచనా వేస్తోంది. ఇది జూన్ త్రైమాసిక వాస్తవ జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ప్రభావం తక్కువగానే ఉంటుందని.. గతేడాదితో పోలిస్తే షరతులు మరీ కఠినంగా లేకపోవడం, అందరూ సరికొత్త జీవనానికి అలవాటు పడడం ఇందుకు కారణాలని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను, జీవితాలను కాపాడేది టీకాలేనని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త తన్వీ గుప్తా అంటున్నారు.
డిసెంబరు చివరకు 43% జనాభాకు టీకాలు
డిసెంబరు చివరి నాటికి దేశ జనాభాలో 43 శాతం లేదా 18 ఏళ్లు పైబడిన జనాభాలో 64 శాతం మేర టీకాలు వేసే అవకాశం ఉందని గుప్తా అంచనా వేశారు. రోజుకు 25-30 లక్షల మేరే టీకా డోసుల ఉత్పత్తి ఉండడాన్ని గుర్తు చేశారు. మే చివరకు ఇదే స్థాయిలో ఉత్పత్తి ఉండొచ్చని; నవంబరు కల్లా రోజుకు 60 లక్షల డోసులకు ఉత్పత్తి చేరొచ్చని ఆమె అన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ పోరులో 'టాటా' ఆక్సిజన్ సాయం