గృహ రుణం తీసుకున్నవారికి, ఇంటి పునర్ నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ(మరో అంతస్తు నిర్మించడం వంటివి), నిర్వహణ లాంటి వాటి కోసం టాప్-అప్ లోన్ అందిస్తాయి బ్యాంకులు. ఈ టాప్-అప్ లోన్‌ను ఇప్పటికే గృహ రుణం తీసుకున్న బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. లేదా టాప్-అప్‌లోన్‌ను అభ్యర్థిస్తూ వేరొక బ్యాంకుకు గృహ రుణాన్ని బదిలీ చేయవచ్చు.
సాధారణంగా ప్రస్తుతం గృహ రుణం ఉన్న బ్యాంకు వడ్డీ రేటు కంటే.. వేరొక బ్యాంకు తక్కువ వడ్డీకే రుణం ఇస్తుంటే, వడ్డీ తగ్గించుకునేందుకు రుణ బదిలీ చేస్తుంటారు చాలామంది. అయితే రుణ బదిలీకి ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు. టాప్-అప్ లోను కోసమూ బదిలీ చేయవచ్చు. అంటే మరొక బ్యాంక్ లేదా బ్యాంకింగేతర సంస్థలు ప్రస్తుతం ఉన్న గృహ రుణాన్ని తమ బ్యాంక్‌కు బదిలీ చేస్తే, టాప్-అప్ లోన్‌ను ఇచ్చేందుకు సిద్ధపడతాయి. అలాంటప్పుడు కూడా కొంతమంది వినియోగదారులు రుణ బదిలీ చేసేందుకు చూస్తుంటారు.
ఇవి తెలుసుకోవాలి..
గృహ రుణాన్ని ప్రస్తుతం ఉన్న బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు బదిలీ చేసేవారు.. కొత్త బ్యాంక్ రుణ పాలసీని అధ్యయనం చేయాలి. ప్రతి బ్యాంకు ఒకే విధానాన్ని అనుసరించదు. ఉదాహరణకు.. పైసాబజార్.కామ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. కెనరా బ్యాంక్ గరిష్ఠంగా రూ.25 లక్షల టాప్-అప్ లోన్ అందిస్తుండగా, ఇండియన్ బ్యాంక్ రూ.60 లక్షల వరకు ఆఫర్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వంటి కొన్ని బ్యాంకులు టాప్-అప్ రుణంపై ఎలాంటి గరిష్ఠ పరిమితి విధించడం లేదు. రుణం తీసుకునే వ్యక్తి అర్హత, ఆదాయం, తిరిగి తీర్చగల సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించి టాప్-అప్ రుణంపై నిర్ణయం తీసుకుంటున్నాయి.
కొన్ని బ్యాంకులు కాలవ్యవధిపైనా పరిమితులు విధిస్తాయి. ఉదాహరణకు.. పంజాబ్& సింద్ బ్యాంక్, కెనరా బ్యాంకులు 10 సంవత్సరాల గరిష్ఠ కాలపరిమితితో టాప్-అప్ గృహ రుణాన్ని అందిస్తుండగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 సంవత్సరాల కాలపరిమితితో టాప్-అప్ లోన్ ఆఫర్ చేస్తుంది.
కాలవ్యవధి పెరిగే కొద్దీ వడ్డీ కూడా..
ప్రాథమిక గృహ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు మిగిలి ఉన్న కాలపరిమితి ఆధారంగా కూడా టాప్-అప్ లోన్ కాలవ్యవధిని నిర్ణయిస్తున్నాయి కొన్ని బ్యాంకులు. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న గృహ రుణం చెల్లించేందుకు 15 సంవత్సరాల కాలం ఉంటే, అంతే వ్యవధితో టాప్-అప్ లోన్ మంజూరు చేస్తున్నాయి.
టాప్-అప్ లోన్ కాలపరిమితి ఈఎంఐ(ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాలమెంట్స్)ను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు.. 10 సంవత్సరాల కాలపరిమితితో రూ.25 లక్షల టాప్- అప్ లోన్ తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.30,332. అదే 15 సంవత్సరాల వ్యవధి ఇస్తే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.23,891. 20 సంవత్సరాలు అనుమతిస్తే ఈఎంఐ రూ.20,911 గా ఉంటుంది.
అయితే కాలవ్యవధి పెరిగే కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుందని మరవద్దు. ఉదాహరణకు.. రూ. 26 లక్షల రుణాన్ని 10 సంవత్సరాల కాలపరిమితితో తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రూ.11,39,828. అదే 20 సంవత్సరాలకు తీసుకుంటే వడ్డీ రూ.25,18,640.
చివరిగా..
ఇప్పటికే గృహ రుణం ఉన్నవారు.. టాప్-అప్ లోన్ తీసుకోవాలనుకుంటే, ముందుగా మీరు రుణం తీసుకున్న బ్యాంకును సంప్రదించాలి. ఆ బ్యాంకు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటు, కాలవ్యవధి తదితర విషయాలను తెలుసుకుని, ఇతర రుణదాతలతో పోల్చి చూడాలి. రుణాన్ని బదిలీ చేయాలనుకుంటే.. ప్రాసెసింగ్ ఫీజు వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చక్కగా ఆర్థిక ప్రణాళిక వేసుకుని, దాని ప్రకారం నిధులను నిర్వహిస్తే, ఎటువంటి పెనాల్టీలు లేకుండా.. అనుకున్న సమయం కంటే ముందుగానే టాప్-అప్ రుణాన్ని చెల్లించవచ్చు.
ఇవీ చదవండి: