అమెరికాలోని కేంద్ర బ్యాంకైన ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. సమీప భవిష్యత్తులోనూ యథాతథంగా ఉంటాయనే సంకేతాలు ఇచ్చింది. ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండటం సహా అల్ప ద్రవ్యోల్బణం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ దిశను నిర్దేశించటం సహా వివిధ దేశాలను ప్రభావితం చేసే ఈ వడ్డీ రేట్లు ప్రస్తుతం 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలోనే ఉంది. ప్రస్తుత ద్రవ్యపరపతి విధానం సరైనదని కమిటీ భావించింది. బలమైన ఆర్థిక మూలాలు వ్యవస్థను మద్దతిస్తున్నట్లు కమిటీ భావించింది. ఇందులో మంచి ఆర్థిక పరిస్థితి, అధిక ఉద్యోగ వృద్ధి, వేతనాల పెరుగుదల, వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉండటం వంటివి ఉన్నాయి.
- జెరోమ్ పావెల్, ఫెడరల్ రిజర్వు ఛైర్మన్
ద్రవ్యోల్బణం పెంచటంలో విఫలం....
ప్రస్తుతం వార్షిక ద్రవ్యోల్బణం 1.5 శాతంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని నిపుణులు వేసిన అంచనా తలకిందులైంది. 2 శాతం ద్రవ్యోల్బణం సాధించాలన్న లక్ష్యాన్ని అందుకోవటంలో ఇంకా విఫలమవుతూనే ఉన్నట్లు ఫెడ్ ప్రకటన ద్వారా స్పష్టమైంది.
అంతకుముందు... ఫెడ్ వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచుతుందని ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహించారు. అల్ప వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థ లాభపడుతుందని విశ్లేషించారు.