కొవిడ్ మహమ్మారి ప్రభావం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీపైనా పడుతోంది. వచ్చే ఐదేళ్లకు రాష్ట్రాలకు కేంద్రం అందించే గ్రాంట్లలో కోత తప్పేలా లేదు. అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు అందే వాటా మాత్రం ఇప్పుడున్న 41 శాతమే కొనసాగే సూచనలున్నాయి. ఈ వాటాను యథాతథంగా కొనసాగించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. 2020-21 సంవత్సరానికి ఆర్థిక సంఘం సమర్పించిన మధ్యంతర నివేదికలో తొలుత 41 శాతాన్ని ఖరారు చేశారు. అదే నిష్పత్తిని వచ్చే అయిదేళ్ల కాలానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. 2021-26 సంవత్సరాలకు సంబంధించిన నివేదికను 15వ ఆర్థిక సంఘం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. సంఘం ఛైర్మన్ ఎన్‌కే సింగ్, సభ్యులు అజయ్‌నారాయణ్ ఝా, అనూప్‌సింగ్, అశోక్ లాహిరి, రమేష్‌చంద్, కార్యదర్శి అరవింద్ మెహతాలు సంయుక్తంగా రాష్ట్రపతికి నివేదిక అందజేశారు.
కరోనా నేపథ్యంలో దేశంలోని వైద్యఆరోగ్య వ్యవస్థలో కనిపించిన లోపాలను సరిదిద్దడానికి కొత్తగా రూ.లక్ష కోట్ల గ్రాంట్‌ను ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టు సమాచారం. ఐదేళ్లలో స్థానిక సంస్థలకు రూ.4.3 లక్షల కోట్లు, 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.2.9 లక్షల గ్రాంటు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. మధ్యంతర నివేదికలో అనుసరించిన విధంగానే జనాభాకు 15శాతం, ప్రాంతానికి 15శాతం, అటవీ, పర్యావరణానికి 10శాతం, ఆదాయ వ్యత్యాసం 45శాతం, పన్ను, ఆదాయ సముపార్జన ప్రయత్నాలు(ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్)కి 2.5శాతం, జనాభా తేడాకు 12.5శాతం (డెమోగ్రఫిక్ డిస్టన్స్)కి ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రాలకు వాటాలను నిర్ధారించారు.
తెలుగు రాష్ట్రాల వాటా ఎంత?
దీని ప్రకారం కేంద్ర పన్నుల్లో వాటాగా ఏపీకి 4.111శాతం, తెలంగాణకు 2.133శాతం దక్కనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు రూ.90 వేల గ్రాంట్ సిఫార్సు చేయగా, వచ్చే అయిదేళ్ల కాలానికి రూ.4.3 లక్షల కోట్లు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సిఫార్సుల ప్రకారం చూస్తే వచ్చే అయిదేళ్లకు రూ.4.50(90x5 సం) లక్షల కోట్లు దక్కాల్సి ఉండగా, అందులో రూ.20 వేల కోట్ల మేర కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.74,340 కోట్లు, మూడు రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ కింద రూ.6,764 కోట్లు కేటాయించింది. ఈసారి వాటన్నింటినీ కలిపి 17 రాష్ట్రాలకు అయిదేళ్ల కాలానికి రూ.2.9 లక్షల కోట్ల రెవెన్యూ గ్రాంట్‌ను సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది కేటాయించిన లెక్కల ప్రకారం చూస్తే 17 రాష్ట్రాలకు కలిపి ఏటా రూ.81,134 కోట్ల చొప్పున అయిదేళ్ల కాలానికి రూ.4,05,670 కోట్లు కేటాయించాల్సి ఉండగా... అందులో 28.5శాతం మేర కోత పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద ఏటా రూ.58 వేల కోట్లే వస్తుంది.
- 2020-21లో 14 రాష్ట్రాలకు కేటాయించిన రూ.74,340 కోట్ల రెవెన్యూ గ్రాంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 7.93శాతం వాటాగా రూ.5,897 కోట్లు దక్కింది. ఇదే నమూనాను కొత్త సిఫార్సుల్లోనూ వర్తింపజేసి ఉంటే ఏపీకి ఏటా రూ.4,599 కోట్లు మాత్రమే దక్కే అవకాశం ఉంటుంది. ఏటా రూ.1,298 కోట్ల చొప్పున అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రూ.6,490 కోట్లు కోల్పోవాల్సి వస్తుంది.
- తెలంగాణకు ఈ ఏడాది రూ.2,736 కోట్ల స్థానిక సంస్థల గ్రాంట్ రాగా, వచ్చే ఏడాది నుంచి అది రూ.2,614 కోట్లకు పరిమితమయ్యే సూచనలున్నాయి. ఈ లెక్కన ఏటా రూ.121 కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.605 కోట్లు కోల్పోయే సూచనలున్నాయి.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సంఘం రూ.లక్ష కోట్ల గ్రాంట్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4 వేల కోట్లు, తెలంగాణకు రూ.2 వేల కోట్లపైన దక్కే అవకాశం ఉంటుంది. దేశంలో వైద్యఆరోగ్య రంగ సమర్థతను పెంచడం కోసం 2021-22 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 8 శాతం నిధులు కేటాయించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'బీఎండబ్ల్యూ' సూట్ వేసుకుంటే ఎగిరిపోవచ్చు!