ఎస్ బ్యాంక్‌పై మారటోరియాన్ని ఎత్తివేసింది రిజర్వు బ్యాంక్. ఫలితంగా ఖాతాదారులకు ఈ సాయంత్రం 6 గంటల నుంచి బ్యాంకింగ్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.
మారటోరియం ఆంక్షల తొలగింపుతో ఖతాదారులు డిపాజిట్ల ఉపసంహరణకు బ్యాంకు శాఖలకు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే సంక్షోభం నుంచి తేరుకుని యథాతథంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున.. బ్యాంకులో నిధుల లభ్యత విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని ఎస్ బ్యాంకు సీఈఓ, ఎండీగా నియమితులైన ప్రశాంత్ కుమార్ ఇదివరకే వెల్లడించారు.
పెట్టుబడుల ప్రవాహం
'ఎస్‌బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక-2020'ను ఆర్బీఐ ప్రతిపాదించినప్పటి నుంచి పెట్టుబడులు పోటెత్తాయి. భారతీయ స్టేట్ బ్యాంకు రూ.6,050 కోట్లతో (60.50 కోట్ల షేర్లు) సుమారు 43 శాతం వాటా కొనుగోలు చేసింది. ఎస్బీఐతో పాటు మరికొన్ని బ్యాంక్‌లు ఎస్ బ్యాంక్‌లో పెట్టిన పెట్టుబడులు ఇలా ఉన్నాయి.
బ్యాంకు | పెట్టుబడి(రూ. కోట్లలో) | కొనుగోలు వాటా (శాతంలో) |
ఐసీఐసీఐ | 1000 | 7.97 |
హెచ్డీఎఫ్సీ | 1000 | 7.97 |
యాక్సిస్ | 600 | 4.78 |
కోటక్ మహీంద్రా | 500 | 3.98 |
ఫెడరల్ | 300 | 2.39 |
బంధన్ | 300 | 2.39 |
ఐడీఎఫ్‌సీ | 250 | 1.99 |
భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌పై ఈ నెల 5న ఆర్బీఐ మారటోరియం విధించింది. వినియోగదారులకు రూ.50,000 వరకు మాత్రమే నగదు ఉపసంహరణకు అనుమతించింది. బ్యాంక్‌ను సంక్షోభం నుంచి బయటకు లాగేందుకు కేంద్రం ఉద్దీపనలు ప్రకటించగా.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మారటోరియం ఎత్తివేసింది ఆర్బీఐ.
మారటోరియం ఎత్తివేతకు ముందు ఎస్ బ్యాంక్ షేర్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. బీఎస్ఈలో సంస్థ షేర్లు నేడు ఏకంగా 49.95 శాతం వృద్ధిచెందాయి. ఒక షేరు ధర రూ.87.95కు చేరింది. ఎన్ఎస్ఈలోనూ 48.84 శాతం పెరిగిన షేరు విలువ ప్రస్తుతం రూ.87.30గా ఉంది.