దేశంలో కరోనా కేసులు(corona cases in India) తగ్గుముఖం పట్టడం.. టీకా డోసుల పంపిణీ(Vaccination in India) 100 కోట్ల మార్కును దాటడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. ఇప్పటికే పలు రంగాలు ఒక్కొక్కటిగా తిరిగి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ పరిస్థితుల్లో ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోనివి అంటే ఐటీ కంపెనీలే. వీటిలో కూడా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అడుగులేస్తున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దిగ్గజ సంస్థలు.. ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలన్నీ తమ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోంకు ముగింపు పలికి.. వారిని ఆఫీస్‌లకు తిరిగి రప్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
90శాతం మంది ఆఫీసుకు..!
త్వరలో తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు పిలుస్తామని ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్(TCS employees work from office) తెలిపింది. తమ ఉద్యోగుల్లో ఇప్పటికే 70 శాతం మంది పూర్తిస్థాయిలో.. 95 శాతం మంది ఒక్కడోసు టీకా తీసుకున్నారని కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయానికి సంబంధించిన వివరాలను ప్రకటించిన సమయంలో ఈ మేరకు తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభానికి 90 శాతం మందిని ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు(companies calling employees back to office) రప్పించాలని టీసీఎస్ యేచిస్తున్నట్లు చెప్పారు. అయితే తమ ఉద్యోగుల్లో 25శాతం మందిని అవసరాన్ని బట్టి 2025 వరకు ఇంటి నుంచి పని చేయించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైబ్రిడ్ విధానంలోనే..
ఇన్ఫోసిస్.. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలని భావిస్తుంది. తమ ఉద్యోగుల్లో దాదాపు 86 శాతం మంది ఒక డోసు కరోనా టీకా తీసుకున్నందున.. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించడానికి అన్ని విధాల కసరత్తు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రతినిధి ప్రవీణ్ రావు తెలిపారు. ఉద్యోగుల ఉత్పాదకత, సైబర్ భద్రత, అనుసంధానం, పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తగిన వనరులు ఉన్నట్లు పేర్కొన్నారు.
సెప్టెంబరు నుంచే..
పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్న తమ ఉద్యోగులకు గత నెల నుంచే తిరిగి ఆఫీసుకు రప్పిస్తోంది విప్రో. ఈ కంపెనీ కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది. ఈ మేరకు గత నెల 12 ఆ సంస్థ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్వీట్ చేశారు. "18 నెలల తర్వాత.. మా ఉద్యోగులు ఆఫీస్‌కు రానున్నారు (వారంలో రెండు రోజులు మాత్రమే). వారంతా పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్న వారే. సురక్షితంగా, భౌతిక దూరం పాటిస్తూ.. పని చేసేందుకు సర్వం సిద్ధమైంది" అని ప్రేమ్‌జీ ట్వీట్లో పేర్కొన్నారు.
హెచ్‌సీఎల్ టెక్ కూడా..
మరో దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ కూడా.. హైబ్రిడ్ పద్ధతిలోనే తమ సీనియర్ ఉద్యోగులు.. వారానికి రెండు రోజులు ఆఫీసులకు రావాలని పేర్కొంది. అదే సమయంలో మిగిలినవారు కూడా అవసరాన్ని బట్టి వారానికి ఒకరోజు కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆ సంస్థ హెచ్‌ఆర్ వీవీ అప్పారావు పేర్కొన్నారు.
ఉద్యోగుల ఉత్పాదకత క్షీణత వల్లే..!
కరోనా కాలంలో అనుసరించిన వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పలు కంపెనీలు తమ ఉద్యోగులు.. అద్దె, విద్యుత్ ఖర్చు, ఇతర నిర్వహణ ఖర్చులను ఆదా చేసుకుంటూ సురక్షితంగా ఉంచడంలో సహాయపడ్డాయి. అయితే తమ ఉద్యోగుల ఉత్పాదకత తగ్గిందని.. గిగ్ ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పొందడానికి ప్రయత్నించినట్లు మరికొన్ని కంపెనీలు అంచనాకు వచ్చాయి. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులు నవంబరు-డిసెంబరు లోపు తిరిగి ఆఫీసుకు రప్పించడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: 28 దేశీయ విమానాలకు స్పైస్‌జెట్ గ్రీన్‌సిగ్నల్