మార్పు నిరంతర ప్రక్రియ. అది ఉన్నట్లుండి వచ్చేది కాదు. కానీ కరోనా వైరస్ ప్రపంచం మీద దాడి చేశాక ఆ మార్పు చాలా వేగంగా చోటు చేసుకుంటోంది. రాబోయే పదేళ్లలో వస్తాయనుకున్న మార్పులు ఇపుడే వచ్చేలా చేసింది. ఎప్పటికో కానీ సాధ్యపడవనుకున్న పనులు కూడా ఇపుడే చేసుకునేలా చేసింది. ముఖ్యంగా కంపెనీల కార్యాలయాలు, కార్యకలాపాల తీరులో ఇది కనిపిస్తోంది. ఇందుకు చైనానే ఆదర్శం. ఇప్పటికే అక్కడ చాలా వరకు వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. అక్కడ చేపడుతున్న చర్యలు, పని విధానాలను మిగతా దేశాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
కార్యాలయ వాతావరణం
చైనాలో కంపెనీలు చాలా వేగంగా కొన్ని పనులు చేపట్టాయి. ‘ఆరడుగుల కార్యాలయాన్ని’ తీసుకొచ్చాయి. ఒక ఉద్యోగికి మరొక ఉద్యోగికి మధ్య కనీసం ఆరడుగులు ఉండేలా చూసుకున్నాయి. సామాజిక దూరం పాటించేలా కార్యాలయ భవనాల్లో మార్పులు చేశాయి. భారత్‌లోనూ ఇప్పటికే కొన్ని కార్యాలయాలు ఈ దిశగా అడుగులు వేశాయి కూడా. ఒక ఆరోగ్యవంతమైన వాతావరణంలో పనిచేస్తున్నామన్న విశ్వాసాన్ని ఉద్యోగులకు కలిగేలా చేస్తున్నాయి.
- ఈ సరికొత్త సాధారణ ప్రపంచంలో డెస్క్‌లకు మధ్య ఎడం ఆరడుగులు ఉండేలా చేసుకుంటున్నాయి. కరోనా ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా ఉండేందుకు రాబోయే కొద్ది నెలలు ఇదే పద్ధతిని కంపెనీలు పాటించే అవకాశం ఉది.
- ఎంట్రీ పాస్‌లు స్వైపింగ్ చేయకుండా.. ఫేసియల్ రికగ్నిషన్ లేదా ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ల ద్వారా కార్యాలయంలోకి సిబ్బందిని ప్రవేశించేలా చేయనున్నాయి.
- కార్యాలయంలో గాలిని వడబోసే వ్యవస్థలపైనా కంపెనీలు పెట్టుబడులు పెంచవచ్చు.
- సిబ్బంది ఆఫీసుల్లో నడిచేటపుడు ‘వన్ వే’ను పాటించేలా చేస్తున్నాయి. ఒకరికొకరు ఎదురుపడకుండా చూడడం కోసమే ఈ ఏర్పాటు.
కొత్త ఆవిష్కరణలు
ప్రజలు కంపెనీల వద్దకు వచ్చి ఉత్పత్తులను చూసి కొనేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో, భవిష్యత్‌లో పెద్దగా ఇష్టపడకపోవచ్చు. ఇది విక్రయాలను గండి కొట్టే అంశం. ప్రజలు మనవద్దకు రాకపోతేనేం. ప్రజల ఇంటికే కంపెనీలు వెళితే.. అది కూడా వర్చువల్‌గా. ఇదే ఆలోచనను చాలా వరకు కంపెనీలు చేస్తున్నాయి.
ఎక్స్‌పీరియన్స్ ఫ్రం హోం.. ఇపుడు కంపెనీల సరికొత్త నినాదం ఇది. ప్రజల షాపింగ్ అలవాట్లను ఇది మార్చనుంది. ఇంట్లో కూర్చునే షోరూం అనుభవాన్ని పొందేలా వర్చువల్ రియాల్టీ యాప్‌లను తీసుకురావొచ్చు. వీటి ద్వారా వినియోగదార్లను ఆకట్టుకోనున్నాయి. ఆన్‌లైన్ విక్రయాల కోసం సరికొత్త ఉత్పత్తులనూ ప్రవేశపెట్టే కంపెనీలూ రావొచ్చు. ఇప్పటికే చైనాలో నైకీ కొత్తగా ఎయిర్ జోర్డాన్స్ పేరిట లిమిటెడ్ ఎడిషన్ స్నీకర్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది.
భారత్‌లోనూ కొన్ని వాహన కంపెనీలు ఆన్‌లైన్ విక్రయాలకు శ్రీకారం చుట్టాయి. వోల్వో వంటి కంపెనీలు ఇంట్లో ఉండే కార్లను బుక్ చేసుకునేలా ‘కాంటాక్ట్‌లెస్ ప్రోగ్రామ్’ల ద్వారా వీలు కల్పిస్తున్నాయి.
సూపర్ మార్కెట్ కంపెనీలు ఇంటికే సరుకుల ఉచిత డెలివరీ చేయడం మొదలుపెట్టాయి. భవిష్యత్‌లో లాక్‌డౌన్ ఎత్తేసినా సూపర్‌మార్కెట్లకు ప్రజలు ఇదివరలా వెళ్లకపోవచ్చు. అందుకే ఈ ఉచిత డెలివరీలను ఈ సంస్థలు కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవంతంగా పనిచేస్తున్న అమెజాన్ పాంట్రీ, బిగ్‌బాస్కెట్ వంటి ఆన్‌లైన్ సరుకుల డెలివరీ యాప్‌ల వినియోగం కూడా పెరగనుంది.
ఇప్పటి వరకూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, బిగ్‌బాస్కెట్ వంటి కంపెనీలు డెలివరీ బాయ్స్‌ను నియమించుకునేవి. భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు సైతం ఈ తరహా నియామకాలు చేపట్టకతప్పదు. ఒక విధంగా ఉపాధి కూడా పెరుగుతుంది.
అతిపెద్ద విప్లవం.. వర్క్ ఫ్రం హోం
మరో అయిదేళ్లకు కానీ సాధ్యపడదనుకున్న ‘ఇంటి నుంచే పని’ కరోనా కారణంగా చాలా వేగంగా అమల్లోకి వచ్చింది. భవిష్యత్‌లోనూ తన సిబ్బందిలో అధిక భాగం సిబ్బందిని ‘వర్క్ ఫ్రం హోం’(డబ్ల్యూఎఫ్‌హెచ్)కే పరిమితం చేయనున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఇతర ఐటీ కంపెనీలూ ఇదే బాట పట్టవచ్చు.
- ఐటీ కంపెనీలనే కాదు.. అంకుర సంస్థలు ఇంటి నుంచే పనికి అధిక ప్రాధాన్యం ఇవ్వవచ్చు. తద్వారా వ్యయాలను భారీగా తగ్గించుకునేందుకూ అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అంకుర సంస్థలకు ఆఫీస్ వ్యయాలే అధిక భారాన్ని మోపుతుంటాయి.
- ఇతర సంప్రదాయ కంపెనీలు సైతం ఇప్పటి నుంచే ఆ ఆలోచన చేస్తున్నాయి. భారీ కార్యాలయాల స్థానంలో తక్కువ సిబ్బందితో చిన్న కార్యాలయాల వైపు మొగ్గుచూపవచ్చు. ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు వంటి సౌకర్యాలు కలిగించి ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహించవచ్చు.
- సిబ్బందికి షిప్టుల వారీగా వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేసేలా ప్రోత్సహించడానికి సైతం కంపెనీలు సిద్ధపడవచ్చు. సంప్రదాయ కంపెనీలు కూడా వీడియో కాన్ఫరెన్సులు, ఆన్‌లైన్ అనుమతుల వంటి సాంకేతికతను అందిపుచ్చుకోవచ్చు.
- సాధారణంగా ప్రైవేటు కార్యాలయాల్లో ఏదైనా ఆలోచన వచ్చినపుడు ఆఫీసులో ఉన్నట్లయితే వాళ్ల దగ్గరకు వెళ్లి ఆలోచన పంచుకోవడం కార్యాచరణలోకి దిగడం జరగుతుంటుంది. వర్క్ ఫ్రం హోం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలూ ఉన్నా.. అదే భవిష్యత్ ధోరణి కానుంది. చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత ఆఫీసుకు రాకపోవడంతో వారి నైపుణ్యాలను పొందలేకపోతున్న కంపెనీలకు ఇపుడు వారి సామర్థ్యాలనూ వినియోగించుకోవడానికి వీలవుతుంది.
- పనిచేయి - ఆగు - మదించు - అంచనా వేయి - మళ్లీ తిరిగి పనిచేయి (యాక్ట్-పాజ్-అసెస్-యాంటిసిపేట్-యాక్ట్) సిద్ధాంతాన్ని కంపెనీలు పాటించొచ్చు. ఈ తరహా సంక్షోభాలు ఎదురైనా ఉత్పాదకతపై ప్రభావం పడకుండా, వినియోగదార్లకు దూరం కాకుండా ఈ జాగ్రత్తలు పాటించబోతున్నాయి.
దేశీయంగానే సరఫరా వ్యవస్థలు
ఇప్పటి వరకు కొన్ని ముడిపదార్థాలు, ఇతరత్రా వాటికి విదేశాలపై ఆధారపడుతూ వస్తున్నాం. ముఖ్యంగా చైనాపై వాహన కంపెనీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ ఆధారపడే తత్వాన్ని తగ్గించుకోవాలని కంపెనీలు గట్టిగా భావిస్తున్నాయి.
కొవిడ్-19 ప్రభావం తగ్గాక స్థానిక సరఫరా వ్యవస్థ బాగా పెరుగుతుందని టాటా స్టీల్ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. ఈ విషయంలో దేశీయంగా ఇంకా చెప్పాలంటే.. పక్కనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చే ధోరణి పెరగనుంది.
ఇవేకాక.. ఊహకు అందని మార్పులుచేర్పులు కూడా భవిష్యత్‌లో చోటు చేసుకుని అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఒక భారీ సంక్షోభం తర్వాత అవసరం నేర్పే పాఠాల కారణంగా ఇటువంటి ఆవిష్కరణలు, ఆలోచనలు రావడం మామూలేనని చెబుతున్నాయి. అయితే కొవిడ్ రాక కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒకే సారి ఈ మార్పురావడం విశేషం.
ఇదీ చూడండి:దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవేతో పెట్టుబడులకు అవకాశం