అమెరికాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో.. విమానయాన రంగం తీవ్రం నష్టపోయింది. ఈ నేపథ్యంలో 36 వేల మంది సిబ్బందికి తాత్కాలిక తొలగింపు లేఖలు పంపింది. సంస్థ ఉద్యోగుల్లో ఇది సగానికి సమానం. ఈ ఏడాది అక్టోబర్ నుంచే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
లేఖలు అందుకున్న అందరినీ తొలగిస్తున్నట్లు కాదని.. ఎంత మందిని సెలవులపై పంపాలనే విషయంపై తుది నిర్ణయం తర్వాత తీసుకోనున్నట్లు స్పష్టతనిచ్చింది యునైటెడ్ ఎయిర్‌లైన్స్.
విమానయాన రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. దీనితో చాలా రాష్ట్రాలు ప్రయాణాలపై కొత్త నిబంధనలు విధిస్తున్నాయి. ఫలితంగా డిమాండ్ పుంజుకునే పరిస్థితులు కనిపించడం లేదు అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ప్రయాణాల డిమాండ్‌కు తగ్గట్లు కచ్చితంగా ఉద్యోగులను తగ్గించుకునే పరిస్థితులు ఏర్పడ్డట్లు విమానయాన సంస్థలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను సెలవులపై పంపడం, ఉద్యోగాల సంఖ్య తగ్గించుకోవడం వంటి ప్రణాళికలు వేస్తున్నాయి.
ఇదీ చూడండి:'భారీగా తగ్గనున్న వాహనాల డీలర్ల లాభదాయకత'