రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన డిజిటల్ సేవలన్నింటినీ ఒకే గూటికి చేర్చనుంది. జియో సహా డిజిటల్ విభాగాలన్నింటితో కలిపి పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ పరిణామం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ సేవల సంస్థ అవతరించేందుకు దోహదం చేస్తుందని ఆర్‌ఐఎల్ పేర్కొంది. పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ఏర్పాటు ప్రతిపాదనకు ఆర్‌ఐఎల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది.
రిలయన్స్ జియోతో పాటు ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫాంలు అందిస్తున్న సేవల ద్వారా దేశ డిజిటల్ సేవల వ్యవస్థ ముఖచిత్రాన్ని ఆర్‌ఐఎల్ మార్చేసింది. ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (ఓసీపీఎస్) రైట్స్ ఇష్యూ ద్వారా ప్రతిపాదిత అనుబంధ సంస్థలోకి రూ.1,08,000 కోట్ల ఈక్విటీని పెట్టుబడిగా పెట్టనుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో ఆర్‌ఐఎల్ పెట్టిన రూ.65,000 కోట్ల ఈక్విటీ కూడా ఈ అనుబంధ సంస్థలోకే వెళ్లనుంది. తద్వారా ఈ సంస్థ మొత్తం మూలధన విలువ రూ.1,73,000 కోట్లకు చేరుతుందన్నమాట.
రుణ రహిత సంస్థగా జియో
రిలయన్స్ జియోకి చెందిన రూ.1,08,000 కోట్ల మేర రుణాన్ని ఆర్‌ఐఎల్‌కు బదిలీ చేసే నిమిత్తం డిబెంచర్ హోల్డర్లు సహా కొందరు రుణదాతలకు, ఆర్‌జేఐఎల్‌కు మధ్య ఒక అంగీకారం కుదిరింది. ఈ అంగీకార ప్రతిపాదనకు ఆర్‌జేఐఎల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ పరిణామం వల్ల 2020 మార్చి 31 కల్లా రిలయన్స్ జియో నికర రుణ రహిత సంస్థగా (స్పెక్ట్రమ్ సంబంధిత బకాయిలు మినహా) మారుతుందని ఆర్‌ఐఎల్ వెల్లడించింది. ఇతర అంతర్జాతీయ పోటీ సాంకేతికత సంస్థల మాదిరి.. రుణ రహితంగా ఉండటం వల్ల పెట్టుబడులు వస్తాయని కంపెనీ భావిస్తోంది. తద్వారా భారత్‌లో డిజిటల్ సేవల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన ఆర్థిక సమర్థతను కలిగి ఉంటుందని పేర్కొంది. అయితే పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ఏర్పాటు, రుణ బదిలీ లాంటి ప్రతిపాదనలకు సంబంధింత నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే డిజిటల్ సేవల ప్లాట్‌ఫామ్‌గా కొత్త సంస్థ నిలుస్తుందని ఆర్‌ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రతి భారతీయునికి అసలు సిసలైన డిజిటల్ సమాజ వ్యవస్థను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ‘అనుబంధ సంస్థ కోసం పలు వ్యూహాత్మక పెట్టుబడిదార్లు తమతో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆర్‌ఐఎల్ వాటాదార్లకు మెరుగైన విలువను సృష్టించేందుకు సరైన భాగస్వాములను త్వరలో పరిచయం చేస్తామని’ ముకేశ్ పేర్కొన్నారు.
అధునాతన సాంకేతికతలపై దృష్టి
ప్రస్తుతం మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సావ్న్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఆర్‌ఐఎల్ గ్రూపు నిర్వహిస్తోంది. వీటితో పాటు బ్లాక్‌చెయిన్, కృత్తిమ మేధ, మెషీన్ లెర్నింగ్ లాంటి అధునాతన సాంకేతికతలపైనా.. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, వాణిజ్యం, ప్రభుత్వం- పౌర సేవలు, గేమింగ్, తయారీ లాంటి పలు రకాల సేవలపైనా తన దృష్టిని కొనసాగించనుంది. ప్రతిపాదిత అనుబంధ సంస్థ ఏర్పాటు వల్ల ఆర్‌ఐఎల్ వాటాదార్ల విలువ, ఆర్‌ఐఎల్ ఏకీకృత రుణం, స్టాండలోన్ రుణాలపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది.
ఇదీ చూడండి: జియో ఫీచర్ ఫోన్లకూ 'ఆల్ ఇన్ వన్' ప్లాన్లు