సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్) వివాదంలో టెల్కోలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీం కోర్టు. టెలికాం శాఖకు బకాయిల చెల్లింపులకు సంబంధించి గడువును పొడగించాలని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, టాటా టెలీసర్వీసెస్ తాజాగా వ్యాజ్యం దాఖలు చేశాయి.
బకాయిలు చెల్లించాలన్న సుప్రీం తీర్పును వివాదం చేయట్లేదని.. చెల్లింపులకు సంబంధించి మాకు మరింత సమయం కావాలని మాత్రమే కోరుతున్నట్లు టెల్కోలు స్పష్టం చేశాయి.
ఈ మేరకు దాఖలైన వ్యాజ్యాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. వచ్చేవారం విచారిస్తామని తెలిపింది. బహిరంగ విచారణ జరగాలని పిటిషన్‌దారులు కోరగా.. ఆ విషయంపై ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని సీజేఐ స్పష్టం చేశారు.
అక్టోబర్ తీర్పు..
2019 అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీం. ఇందులో ఏజీఆర్‌పై టెలికాం విభాగం (డీఓటీ) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
ఏజీఆర్ అంటే..
స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులను కలుపుకొని ఏజీఆర్ ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని టెలికాం శాఖకు చెల్లించాలి. 1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్) కింద ఏజీఆర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపైనే అసలు వివాదం రాజుకొంది.
బకాయిల వివరాలు ఇలా..
నవంబర్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్.. టెల్కోలు మొత్తం రూ.1.47 లక్షల కోట్లు బకాయిపడ్డట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ అపరాధ రుసుములపై వడ్డీ తగ్గించే ప్రతిపాదనేదీ లేదనే విషయాన్నీ వెల్లడించారు.
టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఈ బకాయిలలో రూ.92,642 కోట్లు చెల్లింపులు చేయని లైసెన్సు రుసుములు, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్ వినియోగ బకాయిలుగా పేర్కొన్నారు రవి శంకర్ ప్రసాద్.
కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..
- ఎయిర్టెల్ రూ.21,682.13 కోట్లు
- వొడాఫోన్ రూ.19,823.71 కోట్లు
- ఆర్‌కాం రూ.16,456.47 కోట్లు
- బీఎస్ఎన్ఎల్ రూ.2,098.72 కోట్లు
- ఎంటీఎన్ఎల్ రూ.2,537.48 కోట్లు
ఇదీ చూడండి: ఏజీఆర్ రివ్యూ పిటిషన్‌పై టెల్కోలకు సుప్రీం షాక్