స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగ షేర్లు నేటి లాభాలకు దన్నుగా నిలిచాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 169 పాయింట్లు బలపడింది. చివరకు 40,582 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 62 పాయింట్లు వృద్ధి చెంది..11,972 వద్దకు చేరింది.
బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడ్ నిర్ణయం తీసుకోవడం, చైనాతో అగ్రరాజ్య వాణిజ్య యుద్ధం తీవ్రత తగ్గడం కారణంగా అంతర్జాతీయంగా సానుకూలతలు పెరిగాయి. దేశీయంగా నేడు విడుదల కానున్న పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై సానుకూల అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,713 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,491 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,005 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,934 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా మోటార్స్ 7.17 శాతం, ఎస్ బ్యాంక్ 5.96 శాతం, వేదాంత 3.86 శాతం, టాటా స్టీల్ 3.29 శాతం, ఎస్బీఐ 2.91 శాతం, కోటక్ బ్యాంక్ 1.76 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఇన్ఫోసిస్ 2.63 శాతం, ఓఎన్జీసీ 1.68 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 1.51 శాతం, టీసీఎస్ 1.20 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.95 శాతం, టెక్ మహీంద్రా 0.28 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి, ముడి చమురు..
రూపాయి నేడు 21 పైసలు బలపడి.. ఇంట్రాడేలో డాలర్‌తో పోలిస్తే 70.63కు చేరింది. ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ నేడు 0.74 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 64.19 డాలర్లకు చేరింది.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన హాంకాంగ్, సియోల్, టోక్యో సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై సూచీ మాత్రం నష్టాలతో సెషన్ ముగించింది.
ఇదీ చూడండి:'ఫెడ్' బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లు యథాతథం