స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడం నష్టాలకు ప్రధాన కారణం. అనైతిక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫీపై దర్యాప్తులు ముమ్మరం కావడం వల్ల ఆ సంస్థ షేర్లు భారీగా క్షీణించాయి. మార్కెట్ల నష్టాలకు ఇదీ ఓ కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 38 పాయింట్లు కోల్పోయింది. చివరకు 39,020 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించి..11,582 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 39,327 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,840 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,680 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,635 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
భారతీ ఎయిర్టెల్ 3.31 శాతం, రిలయన్స్ 3.12 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 2.09 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.38 శాతం, టాటా స్టీల్ 1.05 శాతం, టాటా మోటార్స్ 0.60 శాతం లాభాలను ఆర్జించాయి.
మొండి బకాయిల కారణంగా ఎస్ బ్యాంకు అత్యధికంగా 5.76 శాతం నష్టపోయింది. ఎస్బీఐ 4.65 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.78 శాతం, ఇన్పోసిస్ 2.36 శాతం, ఎం&ఎం 1.55 శాతం నష్టపోయాయి.
ఇదీ చూడండి: భారత్‌లో ఇప్పుడు మరింత 'ఈజీ'- ర్యాంక్ 63