ప్రభుత్వానికి చెల్లించాల్సిన సవరించిన స్థూల ఆదాయాన్ని(ఏజీఆర్) స్వీయ మదింపు చేసుకోవడం పట్ల టెలికాం కంపెనీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లించేందుకు టెలికాం కంపెనీలకు 20 ఏళ్ల గడువు ఇవ్వాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. ఈ గడువు అసాధారణమైనదని తెలిపింది.
అది తీవ్రమైన నేరం..
విచారణ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. స్వీయ మదింపు చేసుకోవడం ద్వారా టెలికాం కంపెనీలు తీవ్రమైన నేరానికి పాల్పడ్డాయని మండిపడింది. అలా చేయడం అంటే కోర్టు ధిక్కరణకు పాల్పడడమే అని వ్యాఖ్యానించింది.
స్వీయ మదింపునకు అనుమతి ఇవ్వడం ద్వారా తమ అధికారాలను ఆక్రమించుకునేందుకు అనుమతి ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బకాయిలను సొంతంగా లెక్కగట్టుకునేందుకు టెలికాం కంపెనీలకు అనుమతి మంజూరు చేసిన టెలికమ్యూనికేషన్ల శాఖ డైరెక్టరేట్‌ను, డెస్క్ అధికారిని తమ వద్దకు పిలిపిస్తామని తెలిపింది.
ఏజీఆర్ బకాయిలు చెల్లించాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలే అంతిమం అని మరో సారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వాటిని చిత్తశుద్ధితో పాటించాలని టెల్కోలకు తేల్చిచెప్పింది.
తప్పుడు వార్తలకు మీదే బాధ్యత..
ఏజీఆర్‌పై టెలికాం కంపెనీలు తరచూ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఆయా కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లే దీనికి బాధ్యత వహించాలని తెలిపింది. ఇది కోర్టు ధిక్కరణ అని పేర్కొంది.
ఇదీ చూడండి:'భారత వృద్ధి రేటు ఈ ఏడాది 5.2 శాతమే!'