రుణ రహిత సంస్థగా మారాలనే లక్ష్యంతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నిధుల వేటకు సిద్ధమవుతోంది. రైట్స్ ఇష్యూకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రేపు (30న) జరిగే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది.
'మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, త్రైమాసికానికి ఆర్థిక ఫలితాల పరిశీలన, ఆమోదం నిమిత్తం ఏప్రిల్ 30న డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. అదే సమావేశంలో తుది డివిడెండును బోర్డు సిఫారసు చేస్తుంది. దీంతో పాటు నిర్దేశిత నియంత్రణ సంస్థల అనుమతులు, చట్టాలకు లోబడి ప్రస్తుత వాటాదార్లకు రైట్స్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లను జారీ చేసే ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డు పరిశీలిస్తుంద'ని ఆర్‌ఐఎల్ వెల్లడించింది. అయితే రైట్స్ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.
గతంలో చివరిసారి ఆర్‌ఐఎల్ 1991లో నిధుల సమీకరణకు వెళ్లింది. ఆ సమయంలో ఒక్కోటి రూ.55 విలువైన ఈక్విటీ షేర్లుగా మార్చుకునే డిబెంచర్లను జారీ చేసింది. 2021 కల్లా రుణ రహిత కంపెనీగా ఆర్‌ఐఎల్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతేడాది ఆగస్టులో ముకేశ్ అంబానీ ప్రకటించారు. రైట్స్ ఇష్యూ ద్వారా కనీసం 5 శాతం వాటాను ఆర్‌ఐఎల్ తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:'2020లో భారత వృద్ధిరేటు 0.2 శాతమే'