బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి.. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) వ్యాపారాన్ని విడదీసే ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ఈ కొత్త యూనిట్ కంపెనీ వృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది.
ఓ2సీ విభాగం.. రిలయన్స్ రిఫైనరీ, పెట్రో ఆస్తులు, రిటైల్ ఇంధన వ్యాపారాన్ని మాత్రమే కలిగి ఉండనుంది. కేజీ-డి6, జౌళి వంటి వ్యాపారాలు దీని కిందకు రావని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే.. మొదటిసారి ఓ2సీ వ్యాపారాలకు సంబంధించి 2020-21 మూడో త్రైమాసికానికి సమగ్ర ఫలితాలు ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంతకు ముందు పెట్రోకెమికల్ వ్యాపారాల ఫలితాలు వేరుగా నివేదించేంది సంస్థ. ఇంధన రిటైల్ ఆదాయం కంపెనీ మొత్తం రిటైల్ వ్యాపారాల ఆదాయంలో భాగంగా ప్రకటించేది.
2020 అక్టోబర్ డిసెంబర్ త్రైమసిక ఫలితాల్లో.. రిఫైనరీ, పెట్రోకెమికల్, ఇంధన విభాగాల ఫలితాలను ఒకటిగా ప్రకటించింది.
గత ఏడాది నుంచే కసరత్తు..
చమురు-రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను ప్రపంచంలోనే ముడిచమురు అధికంగా ఎగుమతి చేసే సౌదీ చమురు అగ్రగామి సంస్థ ఆరామ్‌కోకు 2,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,12,500 కోట్లు)కు విక్రయించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని 2019లోనే ముకేశ్ అంబానీ ప్రకటించారు. కరోనా వల్ల ఈ ఒప్పంపం పూర్తి కాలేదు. ఈ ఒప్పందాన్ని మరింత సులభతరం చేయడం సహా మరిన్ని అవకాశాలను పెంచుకునేందుకు.. ఓ2సీ వ్యాపారాలను మాతృసంస్థ నుంచి వేరే యూనిట్‌గా మార్చేందుకు గత ఏడాదే కసరత్తు ప్రారంభించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అయితే తాజా ప్రకటనలో ఆరామ్కోతో చర్చలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి:క్యూ3లో రిలయన్స్ లాభం రూ.13,101కోట్లు