ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఫైబర్‌ను రిలయన్స్ సంస్థ సెప్టెంబర్ 5న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. టారిఫ్ ప్లాన్లతో పాటు పలు కీలక అంశాలపై అదే రోజు ప్రకటన చేయనుంది. జియో ఫైబర్ సేవల ప్రారంభంతోపాటు.... రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్లలోనూ భారీ మార్పులు చేసే అవకాశముంది.
జియో... టెలికాం రంగంలో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, ఓటీటీ వంటి అంశాల్లో జియో ఫైబర్ అలాంటి అద్భుతాలే సృష్టిస్తుందని అంచనా.
జియో 4కే సెట్ టాప్ బాక్స్
జియో ఫైబర్ సేవలు ఆస్వాదించేందుకు 4కే సెట్ టాప్ బాక్సే కీలకం. ఇది ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటిది కాదు. వినియోగదారులు ప్రస్తుతం వీక్షిస్తున్న డీటీహెచ్ ఛానళ్లతో పాటు ఓవర్ ద టాప్ ద్వారా జియో సావన్, జియో టీవీ వంటి పలు రకాల సేవలు పొందవచ్చు.
వీడియో కాన్ఫరెన్సింగ్, గేమింగ్‌తో పాటు మిక్స్డ్ రియాలిటీ వంటి ఫీచర్లు జియో సెట్ టాప్ బాక్స్‌కు ప్రత్యేక ఆకర్షణ.
జియో ఫిక్స్డ్ వాయిస్
ఫైబర్ నెట్‌వర్క్‌తో అందిస్తున్న ల్యాండ్‌లైన్ ఫీచర్... జియో ఫిక్స్డ్ వాయిస్. కొన్ని వారాల క్రితం ఈ ల్యాండ్‌లైన్ సేవలపై వినియోగదారులకు ఓ నోటిఫికేషన్‌ను పంపింది రిలయన్స్. సెప్టెంబర్ 5న జియో ఫిక్స్డ్ వాయిస్ ల్యాండ్‌లైన్ విషయంపై మరింత స్పష్టత రానుంది.
అంతర్జాతీయ కాల్స్...
అపరిమిత అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్ ల్యాండ్‌లైన్ రోమింగ్ ప్యాక్‌ను అతితక్కువ ధరకే అందించనుంది జియో. ప్రయోగాత్మకంగా నెలకు రూ. 500 ధరతో అమెరికా, కెనడాకు అపరిమిత కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. రిలయన్స్ ప్లాన్ ప్రస్తుత టారిఫ్‌లతో పోల్చితే ఐదు లేదా పదో వంతు ఉంటుందని అంచనా.
ధర: కొద్దిగా ప్రియమే!
జియో ఫైబర్ టారిఫ్‌లు కాస్త ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. రూ. 700 నుంచి ఫైబర్ ప్రాథమిక ధర ఉంటుందని ఏజీఎం వేదికగా ప్రకటించారు ముఖేశ్. 1జీబీపీఎస్ సేవలకు అది కాస్త ప్రియంగా... రూ. 10వేల ధర ఉండనుందని తెలిపారు. అయితే వివిధ ప్లాన్ల ధరలు సవివరంగా సెప్టెంబర్ 5నే వెలువడనున్నాయి.
జియో కాల్...
జియో ఫైబర్ కనెక్షన్-సెట్‌టాప్ బాక్స్‌తో పాటు అందే మరో సౌకర్యం జియో కాల్. 42వ సర్వసభ్య సమావేశంలోనే ఈ ఆప్షన్ ఎలా పనిచేయబోతోందో ప్రయోగాత్మకంగా చూపింది రిలయన్స్. విడుదల సమయంలోనే ఈ ఫీచర్ గురించి మరింత స్పష్టత రానుంది.
ఇదీ చూడండి: ల్యాండ్‌లైన్ ఉంటే 6 స్మార్ట్‌ఫోన్స్ నుంచి కాల్స్ ఫ్రీ!