తక్కువ ధర ఎక్కువ ఫీచర్లతో ఫోన్ అందించాలనే లక్ష్యంతో షావోమి ప్రవేశపెట్టిన రెడ్‌మీ బ్రాండ్‌కు భారత మార్కెట్లో విశేష ప్రజాదరణ లభించింది. ఈ క్రమంలోనే రెడ్‌మీ బ్రాండ్ తొలి 5జీ ఫోన్లను త్వరలో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. రెడ్‌మీ నోట్ 9 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 9 5జీ పేరుతో ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 9 ప్రో సిరీస్‌కి కొనసాగింపుగా వీటిని తీసుకొస్తున్నారు. మరి ఈ ఫోన్ల ధర, ఫీచర్లు ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం.
రెడ్‌మీ నోట్ 9 5జీ
పొకో ఎక్స్3 మోడల్ ఆధారంగా వీటిని డిజైన్ చేశారని తెలుస్తోంది. అలానే వెనక వైపు సర్కిల్ ఆకృతిలో మూడు కెమెరాలు ఇస్తున్నారట. వీటిలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు ముందు భాగంలో 16 ఎంపీ (నోట్ 9ప్రో 5జీ), 13ఎంపీ (నోట్ 9 5జీ) సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం. రెడ్‌మీ ఫోన్లలో డిస్‌ప్లే కోసం ఎక్కువగా ఫుల్ హెచ్‌డీ ప్యానెల్స్ ఉపయోగిస్తుంటారు. అయితే వినియోగదారుల నుంచి వచ్చిన పలు అభ్యర్ధనల మేరకు వీటిలో అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. మరోవైపు నోట్ 9ప్రో 5జీలో 6.67-అంగుళాల అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడి డిస్‌ప్లే, నోట్ 9 5జీలో 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. షావోమి ఎంఐయూఐ 12 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి.
నోట్ 9ప్రో 5జీలో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, నోట్ 9 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ ఉపయోగించారట. 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుందట. రెడ్‌మీ ఈ ఫోన్లలో 5జీ టెక్నాలజీ ఇస్తున్నప్పటికీ వీటి ధర రూ. 17,000 లోపు ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. నోట్ 9ప్రో 5జీ 6జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ మెమరీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 12జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్లో లభిస్తుందట. నోట్ 9 5జీ మాత్రం 4జీబీ ర్యామ్/64జీబీ, 6జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత మెమరీ, 8జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారట. నవంబరు 26 తేదీన వీటిని విడుదల చేస్తారని సమాచారం.
పొకో ఎం3
పొకో కంపెనీ ప్రపంవ్యాప్తంగా నవంబరు 24 తేదీన ఎం3 పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఎం సిరీస్‌లో పొకో నుంచి వస్తున్న మూడో మోడల్. గతంలో పొకో ఎం2, ఎం2 ప్రో పేరుతో రెండు మోడల్స్ విడదలయ్యాయి. ఎం3లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉపయోగించారు. 6.53-అంగుళాల డాట్ డ్రాప్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో వెనక వైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా మూడు కెమెరాలు ఇస్తున్నారు. అంతేకాకుండా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. బ్లూ, బ్లాక్, యెల్లో కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి ఎప్పుడ ప్రవేశపెడతారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. అయితే రెడ్‌మీ నోట్ 10 పేరుతో భారత్‌లో విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.