బడ్జెట్ స్మార్ట్ఫోన్ల విషయంలో షియోమీకి.. రియల్‌మీకి ప్రస్తుతం తీవ్ర పోటీ నడుస్తోంది. ఈ రెండు సంస్థలు ఫీచర్లు, ధర విషయాల్లో దాదాపు ఒకే విధంగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల షియోమీ నుంచి విడుదలైన రెడ్ మీ నోట్ 8కి పోటీగా.. రియల్ మీ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. 'రియల్ మీ 5ఎస్' పేరుతో ఈ మోడల్‌ను ఆవిష్కరించనుంది ఆ సంస్థ. మరి ఈ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
రెడ్మీ నోట్8 X రియల్ మీ 5ఎస్..
రియల్ మీ 5ఎస్‌ను ఈ నెల 20న ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 'రియల్ మీ5' మోడల్‌కు కొనసాగింపుగా కొత్త మోడల్‌ను తీసుకురానుంది. రెడ్ మీ నోట్ 8 గ్లాస్ బాడీతో అందుబాటులో ఉంది. రియల్ మీ5ఎస్ పాలీకార్పొనేట్ బాడీతో రానున్నట్లు సమాచారం.
రియల్ మీ 5ఎస్ ఫీచర్ల అంచనాలు..
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (48+8+2+2 మెగా పిక్సెళ్లు)
- 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ తెర.. టియర్‌డ్రాప్ నాచ్
- స్నాప్‌డ్రాగన్ 665 ఎస్ఓసీ ప్రాసెసర్
- 5000, ఎంఏహెచ్ బ్యాటరీ.. రెడ్ మీ నోట్ 8 తో పోలిస్తే 1000 ఎంఏహెచ్లు అధికం
- యూఎస్బీ టైప్ సీ పోర్ట్.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
రెడ్ మీ నోట్ 8కి పోటీగా తీసుకువస్తున్నందు వల్ల చాలా ఫీచర్లు.. ఆ మోడల్‌ను పోలి ఉండే అవకాశముందని టెక్ వార్తా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ముఖ్యంగా ధర విషయంలో రియల్ మీ.. షియోమీని అనుసరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 8.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. రియల్ మీ 5ఎస్ ధర ఇంచుమించు ఇంతే ఉండొచ్చని ఓ అంచనా.
రియల్ మీ ఈ నెల 20న నిర్వహించనున్న ఈవెంట్లో 'రియల్మీ ఎక్స్ 2 ప్రో' ప్రీమియం మోడల్‌ను విడుదల చేయనుంది.
ఇదీ చూడండి: అక్టోబర్‌లో 4.62 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం