భారత టెలికాం రంగంలో కేవలం రెండు సంస్థలు మాత్రమే కీలక పాత్ర పోషిస్తుండడంపై భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ విచారం వ్యక్తం చేశారు. భారత్ వంటి పెద్ద దేశంలో కనీసం మూడు టెలికాం సంస్థలైనా సేవలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు 12 టెలికాం ఆపరేటింగ్ సంస్థలు ఉండేవని.. అవి ఇప్పుడు దాదాపు 2.5కు చేరాయన్నారు. త్వరలో అవి రెండుకు చేరే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అదే జరిగితే.. విషాదకరమైన వార్తే అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వర్చువల్‌గా జరిగిన 'ఖతార్ ఎకానమిక్ ఫోరం' సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గుదిబండగా ఏజీఆర్ ఛార్జీలు
సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్) బకాయిలను టెలికాం సంస్థలు తప్పనిసరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం వల్ల వొడాఫోన్ ఐడియాపై తీవ్ర ఒత్తిడి పడింది. అయితే, రానున్న పదేళ్ల పాటు విడతలవారీగా చెల్లించేందుకు అనుమతించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అంచనాల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ.54,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంట్లో ఇప్పటికే రూ.7,854 కోట్లు కంపెనీ చెల్లించింది. పోటీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్-ఐడియాకు ఏజీఆర్ ఛార్జీలు గుదిబండగా మారాయి. రూ.25వేల కోట్లు సమీకరిస్తామని గత ఏడాది తెలిపిన ఈ సంస్థ ఇప్పటి వరకు ఒక్క ఒప్పందం కూడా ఖరారు చేసుకోకపోవడం గమనార్హం.
అలా చేయకుంటే మనుగడ కష్టమే..
ఏజీఆర్ బకాయిల కింద భారతీ ఎయిర్‌టెల్ రూ.43,980 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు చెల్లించేసింది. ఇక ఎయిర్‌టెల్ వృద్ధిపై మిత్తల్ మాట్లాడుతూ..గత కొన్నేళ్లలో ఎయిర్‌టెల్ మార్కెట్ వాటా భారీగా పుంజుకుందని తెలిపారు. ఆఫ్రికాలో తమ సంస్థ బలోపేతమవుతోందన్నారు. అయితే, మహమ్మారి మూలంగా కంపెనీల్లో డిజిటల్ మార్పులు అనివార్యమయ్యాయని తెలిపారు. సంస్థల కార్యకలాపాల దగ్గరి నుంచి వినియోగదారులకు మన్నికైన సేవల్ని అందించే వరకు వివిధ డిజిటల్ సాధనాలు, వేదికలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటికి అనుగుణంగా కంపెనీలో మార్పులు చేయనట్లయితే మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.
ప్రపంచంలో ప్రతి మూలకు 'వన్‌వెబ్'..
ఇక కొత్తగా ప్రారంభించిన 'వన్‌వెబ్' గురించి మిట్టల్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటిని ఫైబర్‌తో అనసంధానించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలకు 'వన్‌వెబ్' చేరుతుందన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో రేడియో సిగ్నల్ ద్వారా సేవలందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:JAMSETJI TATA: దాతృత్వంలో జెంషెట్ జీ టాటాదే అగ్రస్థానం!