భారతీయ రిజర్వు బ్యాంకు ఎట్టకేలకు తొలిసారి... ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల జాబితాను విడుదల చేసింది. ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా ఈ సమాచారాన్ని ఇచ్చింది ఆర్బీఐ.
ఈ జాబితాలో మొత్తం 30 కంపెనీల పేర్లను వెల్లడించింది రిజర్వు బ్యాంకు. వాటిలో చాలా వరకు అందరికీ సుపరిచితమైన కంపెనీలే ఉన్నాయి. ఈ జాబితాలో మెహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.5,044 కోట్ల మొండి బకాయిలతో ప్రథమ స్థానంలో ఉంది.
బ్యాంకుల కేసులతో పేర్లు బయటికి..
ఆర్‌బీఐ ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లను వెల్లడించడానికి నిరాకరిస్తూ వచ్చినా.. బ్యాంకులు తమకు బకాయిలు చెల్లించడంలో విఫలమయ్యాయంటూ కేసులు వేయడం జరిగింది. ఫలితంగా అప్పుడప్పుడు కొందరి పేర్లు బయటకు వచ్చాయి. మరోవైపు ‘ట్రాన్స్‌యూనియన్ సిబిల్’ కూడా గత కొన్నేళ్లుగా ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సమాచారంపై పనిచేస్తోంది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సమాచారం ప్రకారం.. 2018 డిసెంబరు నాటికి 11,000కి పైగా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇవి మొత్తంగా చెల్లించాల్సిన బకాయిల విలువ రూ.1.61 లక్షల కోట్లకు పైనే.
స్తోమత ఉన్నా.. అప్పు తిరిగి చెల్లించకపోతే..
ఆర్‌బీఐ నిర్వచనం ప్రకారం.. స్తోమత ఉన్నప్పటికీ.. అప్పును చెల్లించకుంటే ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పరిగణిస్తారు. అలాగే ఒక అవసరం కోసం తీసుకున్న రుణాన్ని వేరే వాటి కోసం మళ్లించి ఆ రుణాన్ని తిరిగి చెల్లించకుంటే కూడా ఆ ప్రమోటరు లేదా కంపెనీ ఉద్దేశపూర్వక ఎగవేతదారు కిందకు వస్తుంది.
సీఆర్‌ఐఎల్‌సీ సమాచారం ఆధారంగా జాబితా..
కేంద్రీకృత బ్యాంకింగ్ వ్యవస్థ సమాచారగనిగా వ్యవహరించే సీఆర్‌ఐఎల్‌సీ (ద సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆర్‌బీఐ తాజా జాబితా విడుదల చేసింది. రూ.5 కోట్లు అంతకుమించి అప్పు తీసుకున్న రుణగ్రహీతల రుణ సమాచారమంతా సీఆర్‌ఐఎల్‌సీలో ఉంటుంది.
ఆర్బీఐ జాబితా..
ఎగవేతదారు బకాయిలు (రూ.కోట్లలో)
- గీతాంజలి జెమ్స్ 5,044
- రీ ఆగ్రో లిమిటెడ్ 4,197
- విన్సమ్ డైమండ్స్ 3,386
- రుచి సోయా ఇండస్ట్రీస్ 3,225
- రోటోమాక్ గ్లోబర్ 2,844
- కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2,488
- కుడోస్ కెమిలిమిటెడ్ 2,326
- జూమ్ డెవలపర్స్ 2,024
- డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ 1,951
- ఏబీజీ షిప్‌యార్డ్ 1,875
- ఫరేవర్ ప్రీషియస్ జువెలరీ 1,718
- సూర్య వినాయక్ ఇండస్ట్రీస్ 1,628
- ఎస్‌కుమార్ నేషన్వైడ్ 1,581
- గిలి ఇండియా 1,447
- సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్ 1,349
- విఎంసీ సిస్టమ్స్ 1,314
- గుప్తా కోల్ ఇండియా 1,235
- నక్షత్ర బ్రాండ్స్ 1,148
- ఇండియన్ టెక్నో మ్యాక్ 1,091
- శ్రీ గణేశ్ జువెలరీ 1,085
- జైన్ ఇన్ఫ్రా 1,076
- సూర్య ఫార్మస్యూటికల్ 1,065
- నకోడా 1,028
- కేఎస్ ఆయిల్స్ 1,026
- కోస్టల్ ప్రాజెక్ట్స్ 984
- హాంగ్ టాయ్స్&టెక్స్టైల్స్ 949
- ఫస్ట్ లీజింగ్ కంపెనీ 929
- కాన్‌కాస్ట్ స్టీల్ & పవర్ 888
- యాక్షన్ ఇస్పాత్ 888
- డైమండ్ పవర్ 869
ఇదీ చూడండి:మనోళ్లు.. స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువగా కొనేస్తున్నారు!