వేగవంతమైన మొబైల్ నెట్వర్క్ అందిస్తున్న టెల్కోగా రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. సగటున 19.3 ఎంబీపీఎస్(మెగా బైట్స్ పర్ సెకన్) డౌన్లోడ్ స్పీడ్‌ను జియో అందిస్తున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' తాజాగా వెల్లడించింది.
డౌన్లోడ్ల పరంగా ఐడియా 8.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.9 ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 7.5 ఎంబీపీఎస్ స్పీడ్లతో జియో తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ట్రాయ్ తెలిపింది. వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనమైనా.. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతున్నందున రెండు సంస్థల నెట్‌వర్క్‌ల పనితీరును విడివిడిగానే లెక్కించినట్లు ట్రాయ్ వివరించింది.
ఎయిర్టెల్ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తున్నట్లు సెప్టెంబర్‌లో ఓ ప్రైవేటు సంస్థ నివేదిక విడుదల చేయగా.. తాజాగా ట్రాయ్ నెట్వర్క్ స్పీడ్‌పై రిపోర్ట్ విడుదల చేయడం గమనార్హం.
దేశవ్యాప్తంగా మైస్పీడ్ అప్లికేషన్ డేటా సహాయంతో ఈ గణాంకాలు విడుదల చేసింది ట్రాయ్. ఇందులో ఆగస్టుతో పోలిస్తే.. సెప్టెంబర్‌లో అన్ని ప్రైవేటు టెల్కోల ఇంటర్నెట్ సగటు వేగం పెరిగినట్లు వివరించింది.
అప్‌లోడ్‌లో వొడాఫోన్ అగ్రస్థానం..
అప్లోడ్ పరంగా చూస్తే వొడాఫోన్ అత్యధిక వేగవంతమైన నెట్‌వర్క్‌ను అందిస్తున్నట్లు ట్రాయ్ పేర్కొంది. వొడాఫోన్ అప్లోడ్ స్పీడ్ 6.5 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు తెలిపింది. ఐడియా 6.4 ఎంబీపీఎస్, ఎయిర్టెల్, జియో నెట్ వర్క్‌ల సగటు అప్లోడ్ స్పీడ్ 3.5 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు ట్రాయ్ వెల్లడించింది.
ఇదీ చూడండి:క్యూ2లో లాభం తగ్గినా.. విప్రో భారీ బై బ్యాక్ ప్లాన్