బహుళజాతి సంస్థలు తమ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఉత్సుకత చూపుతున్నాయి. నిపుణులైన మానవ వనరుల లభ్యత, సంతృప్తికర మౌలిక సదుపాయాలు ఇందుకు కారణం. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆర్‌అండ్‌డీ కేంద్రాల ఏర్పాటు కోసం 2019 చివరి నాటికి దాదాపు 1.41 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని వివిధ సంస్థలు తీసుకున్నాయి. 2014 నాటి 30.15 లక్షల చదరపు అడుగుల స్థలంతో పోలిస్తే ఇది దాదాపు ఐదు రెట్ల అధికమని కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వేలో తేలింది. ఈ సంస్థ 'గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) - మేకింగ్ ఇండియా ద క్రెడిల్ ఆఫ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ' పేరుతో నివేదికను విడుదల చేసింది. 2014లో మొత్తం కార్యాలయాల అద్దె స్థలంలో ఆర్ అండ్ డీ కేంద్రాల వాటా 8 శాతం కాగా, 2019లో 20.9 శాతానికి చేరింది. రెండు దశాబ్దాలుగా భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు కొనసాగుతున్నా, ఐదారేళ్లుగా అధిక వృద్ధి కనిపిస్తోంది.
నగరాల వారీగా
దేశంలో మొత్తం 1,400 కంపెనీలు దాదాపు 1,750కి పైగా జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో దాదాపు నాలుగోవంతు కంపెనీలు తమ ఆర్‌అండ్‌డీ కేంద్రాల ఏర్పాటుకు భారత్‌ను ఎంపిక చేసుకున్నాయి. భారత సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరులో ఎక్కువ కార్యాలయాలుంటే, తర్వాత స్థానాల్లో హైదరాబాద్, పుణె, చెన్నై ఉన్నాయి. వీటితో పాటు దిల్లీ, ముంబయిలతో కలిపి దాదాపు 1,680 జీసీసీల్లో మొత్తంగా 11.7లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇవీ కారణాలు
వ్యయాలు అందుబాటులో ఉండటం, ఆవిష్కరణలు, డెలివరీ ఎక్స్‌లెన్స్.. ఈ మూడు అంశాల ఆధారంగానే భారత్‌లో జీసీసీ కేంద్రాల వృద్ధి ఆధారపడి ఉందని కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ఎండీ అన్షూల్ జైన్ తెలిపారు. అమెరికా, ఐరోపా, జపాన్ దేశాలకు చెందిన పలు సంస్థలు భారత్‌ను ఒక ఆవిష్కరణల కేంద్రంగా చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏటా 10లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులను అందిస్తున్న మన దేశంలో తక్కువ ఖర్చుకే నిపుణులు దొరకడం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. 2020లో ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10-12 శాతం తగ్గింది. అదే సమయంలో 2022-23 నాటికి వాణిజ్య స్థలాల అద్దె కొంచెం పెరిగే అవకాశం ఉంది.
భవిష్యత్తు బాగుంటుంది
డిజిటల్ అనలిటిక్స్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌లాంటి భవిష్యత్తు సాంకేతికతలపై అధికంగా ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని జైన్ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 తర్వాత అంతర్జాతీయ సంస్థలు కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నాయన్నారు. ఇప్పటికే భారత్‌లోని జీసీసీలు ఈ అంశంలో ముందున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి:పెరిగిన బంగారం, వెండి ధరలు