చెక్ ఇన్ సాఫ్ట్‌వేర్ స్తంభించిపోయిన కారణంగా.. ఎయిరిండియాలోని 137 విమానాలు ఆదివారం ఆలస్యంగా నడిచాయి. సాధారణ సమయం కంటే సగటున 197 నిమిషాలు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు సంస్థ ప్రతినిధులు. అంతకుముందు రోజే... 5 గంటలకు పైగా విమాన సర్వీసుల్లో జాప్యం జరిగింది. దాదాపు 149 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
ఫలితంగా.. పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కువగా దేశీయ విమాన సర్వీసుల మీదే ప్రభావం పడిందని పేర్కొన్నారు అధికారులు.
సోమవారం సాయంత్రం లోగా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వనీ లోహానీ.
ఎయిర్ ఇండియాకు చెందిన ప్రయాణికుల చెక్ ఇన్, బ్యాగేజీ, రిజర్వేషన్‌వంటి అంశాలను ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ (పీఎస్‌ఎస్) అనే సాఫ్ట్‌వేర్ చూస్తుంది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 8.45 గంటల వరకూ ఇది పనిచేయలేదని తెలిపారు ప్రతినిధులు.