పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఆవిష్కరించిన 'ఈ-అసెస్‌మెంట్' పథకానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదాయపన్ను కార్యాలయానికి వ్యక్తిగతంగా వెళ్లకుండానే పన్ను మదింపు చేయించుకునే వీలు కల్పించే ఈ పథకం అక్టోబర్ 8న అమల్లోకి రానుంది.
ఈ పథకం అమలైతే.. ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పన్ను మదింపు చేయించుకోవచ్చు. ఈ-అసెస్‌మెంట్ అన్నది తప్పని సరికాదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారు స్వచ్ఛందంగా పన్ను మదింపు పద్ధతిని ఎంచుకోవచ్చని తెలిపింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అయితే ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంప్రదాయ పద్ధతిలోనూ.. ఆదాయపన్ను కార్యాలయం వద్ద వ్యక్తిగతంగా హాజరై పన్ను మదింపు చేయించుకునే వీలుందని తెలిపింది.
'ఈ-అసెస్‌మెంట్' ఎందుకంటే..
పన్ను చెల్లింపుదారులు వ్యక్తిగతంగా హాజరుకావడం వల్ల ఆదాయపన్ను శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడేందుకు ఆస్కారం కల్గుతోందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాంటి అక్రమాలకు తావివ్వకుండా చేసేందుకు 'ఈ-అసెస్‌మెంట్' పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: 'అక్టోబరులో భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు!'