దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. బాధితులు ఆస్పత్రుల్లో చేరదామన్నా బెడ్లు దొరకడం లేని పరిస్థితి. సరే ఏదోలా బెడ్డు సంపాదించినా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో బెడ్లు, ఆక్సిజన్ వివరాలను తెలిపేలా గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశముంది.
ఎలా పని చేస్తుంది?
సాధారణంగా పడకల సదుపాయం, ఆక్సిజన్ నిల్వల అధికారిక వివరాలను ఆయా సంస్థలు, ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గూగుల్ మ్యాప్స్‌లో ప్రస్తుతానికి అది సాధ్యపడలేదు. దీనికి ఓ ప్రత్యామ్నాయంగా వినియోగదారుల నుంచే వివరాలు సేకరించనున్నారు. అదెలా అంటే.. ఆస్పత్రి, ఆక్సిజన్ సరఫరా కేంద్రాలు ఎక్కడున్నాయన్నది ఇప్పటికే గూగుల్ సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఎవరైనా వ్యక్తి ఆయా చోట్లకు వెళ్తే.. అతనికి బెడ్లు, ఆక్సిజన్ నిల్వల గురించి గూగుల్ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి ఆ వ్యక్తి చెప్పే సమాధానం గూగుల్ సర్వర్‌లో సేవ్ అవుతుంది. ఇంకెవరైనా వ్యక్తులు ఆయా చోట్ల బెడ్లు, ఆక్సిజన్ కోసం ఆరా తీస్తే సంబంధిత డేటా వారికి డిస్‌ప్లే అవుతుంది.
కచ్చితత్వం ఎంత?
అయితే, ఇది ఎంత కచ్చితత్వంతో పని చేస్తుందన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ వివరాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అందువల్ల ప్రతిసారీ ఎవరో ఒకరు దాన్ని అప్‌డేట్ చేస్తేనే కచ్చితమైన వివరాలు చూసే వీలుంటుంది. ''ఇది కేవలం వినియోగదారుడు అందించే వివరాల ఆధారంగానే పని చేస్తుంది. సంబంధిత ఆధికారులెవరూ వివరాలు ఇవ్వరు'' అని గూగుల్ స్పష్టం చేసింది. కేవలం దీనిపైనే ఆధారపడకూడదని, ఆస్పత్రులకు వెళ్లే ముందు కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవాలని వినియోగదారులకు సూచించింది.
గూగుల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 23,000 కొవిడ్ కేర్ సెంటర్ల లోకేషన్లను అందుబాటులో ఉంచింది. ఇంగ్లీష్‌తోపాటు మరో 8 భారతీయ భాషల్లో వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తోంది. మరింత కచ్చితత్వంలో వినియోగదారులకు సేవలు అందించేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖతో కలిసి పని చేస్తున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతా సజావుగా సాగితే వ్యాక్సిన్ లభ్యత, కొవిడ్ కేర్ సెంటర్ల సమాచారాన్ని మరింత కచ్చితంగా తెలుసుకునే వీలుంటుందని గూగుల్ వెల్లడించింది.