చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేకు షాక్ ఇచ్చింది టెక్ దిగ్గజం గూగుల్. హువావేకు ఆండ్రాయిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
గూగుల్ నిర్ణయంతో హువావే భవిష్యత్ ఫోన్లకు గూగుల్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫోన్లకు ఆండ్రాయిడ్ ఆప్డేట్స్ ఉండవు. వీటితో పాటు గూగుల్ ప్రధాన యాప్స్ అయిన యూట్యూబ్, మ్యాప్స్ సహా ఇతర సేవలు నిలిచిపోనున్నాయి.
కారణమేంటి...?
అమెరికా సంస్థలు హూవావేకు సాంకేతికతను అందించే విషయంపై గతవారం ఆంక్షలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్. హువావేను ఎన్టిటీ లిస్టులో చేర్చారు.
ఈ అంక్షల ప్రకారం హువావే అమెరికా సంస్థల సాంకేతికతను పొందాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి.
ఈ ఆదేశాల అమలులో భాగంగానే హువావేకు సేవలు నిలిపివేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.
హూవావే కొత్త ఓఎస్?
గూగుల్ నిర్ణయంపై స్పందించేందుకు నిరాకరించింది హువావే. అయితే రెండు నెలల క్రితం ఓ జర్మన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు గూగుల్ సేవలు అందించకపోతే ప్రత్యామ్నాయంగా కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు హువావే సీఈఓ రిచర్డ్ యూ.
మరి గూగుల్‌తో హూవావే చర్చలు జరుపుతుందో? కొత్త ఓఎస్‌ని అందుబాటులోకి తెస్తుందో? వేచి చూడాలి.
ఇదీ చూడండీ: వాణిజ్య యుద్ధం 2.0: బ్లాక్‌లిస్ట్‌లో హువావే