సిటీ గ్రూప్ సంస్థతో కలిసి కొత్త 'చెకింగ్ అకౌంట్' సేవలను దిగ్గజ సంస్థ గూగుల్ ప్రారంభించనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆర్థిక సంస్థల చెకింగ్ అకౌంట్లకు భద్రతా, నియంత్రణ వంటి వాటిపై గూగుల్ అధ్యయనం చేస్తోందని కథనం ప్రచురించింది. క్యాష్ అనే పేరుతో గూగుల్ ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోందని తెలిపింది.
ఆర్థిక వ్యవస్థలతో పూర్తి స్థాయి భాగస్వామిగా మారేందుకు సంస్థ మొగ్గుచూపుతోందన్న గూగుల్ అత్యున్నత అధికారి వ్యాఖ్యలను జర్నల్ ఉటంకించింది. ఈ ప్రక్రియ సుదీర్ఘమైనదైనా... సురక్షితమైన దారి కాబట్టి సంస్థ ఈ విషయంలో ముందుకెళ్తున్నట్లు పత్రిక తెలిపింది.
ఏంటీ చెకింగ్ అకౌంట్?
చెకింగ్ అకౌంట్ అంటే సాధారణ బ్యాంక్ అకౌంట్ వంటిదే. బ్యాంకులు అందించే డిపాజిట్లు, విత్డ్రాసేవలను ఇది అందిస్తుంది. అయితే బ్యాంకులతో పోలిస్తే అపరిమిత డిపాజిట్లు, అపరిమిత విత్‌డ్రాలు చేసుకునే వీలుంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతితో పాటు, చెక్కులు, ఏటీఎంలతో నగదును బదిలీ చేసుకోవచ్చు.
ఈ-కామర్స్ రంగంపై దిగ్గజాల ఆసక్తి
ఆర్థిక కార్యకలాపాలు సహా ఈ-కామర్స్ రంగంపై అంతర్జాల దిగ్గజ సంస్థలు చాలా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా యాపిల్, గూగుల్ సంస్థలు ఇప్పటికే తమ వాలెట్ సర్వీసులను ప్రారంభించాయి. యాపిల్ సొంత క్రెడిట్ కార్డును కూడా విడుదల చేసింది.
అమెజాన్ సంస్థ సైతం చెకింగ్ ఖాతా సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమ దిగ్గజమైన ఫేస్బుక్ కూడా క్రమక్రమంగా ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. నగదు బదిలీ చేసుకోవడానికి వీలుగా సంస్థకు చెందిన వాట్సాప్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వివాదాస్పద క్రిప్టోకరెన్సీ లిబ్రాను సైతం ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది లిబ్రా విడుదలకు ఫేస్బుక్ ప్రయత్నిస్తున్నప్పటికీ... నగదు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది.