ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు సమావేశం కానున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు... వినియోగదారులకు బదిలీ సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాలని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ గత నెలలో స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమలు చేయాలని సూచించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లు.. ఆర్బీఐ రెపో రేటుకు తగ్గట్లుగా తమ రిటైల్ లోన్ల వడ్డీ రేట్లు సవరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.
నేటి సమావేశంలో ఇంటివద్దే బ్యాంకింగ్ సేవల అంశంపై బ్యాంకర్లతో సీతారామన్ చర్చించనున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. 70 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గృహ, వాహన సహా ఇతర రుణాల ట్రాకింగ్‌కు సంబంధించి బ్యాంకులు ఎలాంటి సహాయం చేయగలవనే అంశం నేటి సమావేశంలో చర్చకు రానుంది. వీటితో పాటు ఇటీవల ప్రకటించిన బ్యాంకుల నుంచి రుణ సదుపాయం పెంపు సహా.. ఆర్థిక వృద్ధి మందగమనం వంటి అంశాలపై సమాలోచనలు చేయనున్నారు సీతారామన్.
ఇదీ చూడండి: మరో ఆరు విదేశీ గమ్య స్థానాలకు ఇండియా పోస్ట్ సేవలు