దేశీయంగా ఆర్థిక మందగమన ప్రభావం విమానయానం మీదా పడుతోంది. రద్దీ అధికంగా ఉండే ప్రస్తుత సీజన్‌లోనూ కొన్ని మార్గాల్లో టికెట్ల ధరలు, ముందస్తు బుకింగ్ కంటే తక్కువకూ లభించడం ఇందుకు నిదర్శనం. జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాక, ఒక్కసారిగా టికెట్ ధరలు పెరిగినా, మిగిలిన సంస్థలు కొత్త విమానాలు సమకూర్చుకుని, సర్వీసులు విస్తరించడమే ప్రస్తుత స్థితికి కారణం.
అత్యంత ఆకర్షణీయంగా కనిపించే విమానయాన రంగం.. ఎన్నో సంస్థలను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీస్తోంది. నిర్వహణ వ్యయాలు.. ఆదాయాల మధ్య అగాధం పెరిగిపోతే, ఆయా సంస్థలు మూతబడక తప్పదు. దేశీయంగా కింగ్‌ఫిషర్, జెట్‌ఎయిర్‌వేస్ వంటి దిగ్గజ సంస్థలు ఇలానే మూతబడగా, ఎయిర్ ఇండియాను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టిన సంగతి విదితమే.
సరైన సమయంలో, తగిన ధరతో, సౌకర్యవంతంగా విమానాలు నిర్వహించడం సవాలుతో కూడినదే. ఇలా చేసిన సంస్థలు విజయవంతమవుతుంటే, మిగిలినవి నష్టాలతో కుదేలవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, దేశీయంగా తలసరి ఆదాయం బాగా తక్కువ (నెలకు రూ.10,534.. ఈ కారణంగా వెచ్చించే ప్రతిపైసాకు తగిన సేవ, ఉత్పత్తిని కోరుకుంటారు. విమాన టికెట్లకూ ఇదే సూత్రం వర్తించడం వల్లే, ప్రపంచ దేశాల్లోనే విమాన ఛార్జీలు మనదేశంలోనే తక్కువగా ఉంటున్నాయన్నది పరిశ్రమ మాట.
ఈ ఏడాది అత్యల్ప ఛార్జీలు
ఏడాదిలో చూస్తే, దసరా-దీపావళి పండుగ సీజన్ నుంచి ఏడాది ముగిసి, కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగ వరకు విమాన ప్రయాణానికి గిరాకీ అధికం. అందువల్ల ఈ సీజన్‌లో విమాన టికెట్ల ధరలు అధికంగా ఉండేవి. అయితే ఈసారి 2-3 నెలల ముందుగా బుక్ చేసుకున్న ధరల కంటే కూడా అక్టోబరులో విమాన టికెట్ల స్పాట్ ధరలు కొన్నిసార్లు తక్కువగా ఉండటం సంస్థలకు ఆందోళనకరంగా మారింది. సరఫరా (ఆయా మార్గాల్లో విమాన సీట్ల) తో పోలిస్తే, డిమాండ్ (ప్రయాణికుల సంఖ్య) తక్కువగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా నెలల తరవాత ప్రయాణానికి తక్కువ ఛార్జీలతో టికెట్లను విమానయాన సంస్థలు విక్రయిస్తుంటాయి. ప్రస్తుత సీజన్‌లో ఆఫర్లలో విక్రయించే టికెట్లతో 15 రోజుల తరవాత నుంచే ప్రయాణించే వీలుంటోంది.
ఎన్నెన్నో కారణాలు..
- 2015 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్యలో రెండంకెల వృద్ధి లభించింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇది మారింది. జనవరి నుంచి జెట్ విమాన సర్వీసులు తగ్గిపోతూ రావడం, మార్చిలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నిలిపి వేయడం, ఏప్రిల్‌లో జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు ఆగిపోవడం వల్ల విమానాల సంఖ్య 530-540కి పరిమితమై, ప్రయాణికుల సంఖ్య తగ్గేందుకు కారణమయ్యాయి. ఆ సమయంలో ఇతర విమానయాన సంస్థలు టికెట్ల ధరలు భారీగా పెంచాయి. ఫలితంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభాలు ఆర్జించాయి.
- అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఇండిగో, స్పైస్‌జెట్ ఎక్కువగా, మిగిలిన సంస్థలూ సాధ్యమైనంతగా విమానాలను సమకూర్చుకుని, సేవలు విస్తరణతో సెప్టెంబరు ఆఖరుకు విమానాల సంఖ్య మళ్లీ 600 దాటి, అక్టోబరుకు 616కు చేరింది.
- అయితే ఆర్థిక మందగమన ప్రభావం వల్ల వ్యాపారాలు అరకొరగా సాగడం, కొత్త ఉద్యోగాలు లేకపోవడం వంటి కారణాలతో మార్చి నుంచి అక్టోబరు వరకు విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి బాగా తగ్గింది. అందువల్లే అధిక ఛార్జీలు ఉండాల్సిన అక్టోబరులో గో ఎయిర్ సంస్థ వార్షికోత్సవం అంటూ రూ.1296 నుంచీ టికెట్లు విక్రయించడం, 15 రోజుల వ్యవధిలోనూ ఈ టికెట్లపై ప్రయాణానికి వీలు కల్పించడం వల్ల మిగిలిన సంస్థలూ టికెట్ల ధరలు తక్కువగా నిర్ణయించాల్సి వచ్చింది. నవంబరు, ప్రస్తుత డిసెంబరులోనూ ఆఫర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఏడాదిక్రితంతో పోలిస్తే, ఛార్జీలు అక్టోబరులోనే 20 శాతం తక్కువగా ఉన్నట్లు యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది. ఆఫర్ల ప్రభావంతో, నవంబరు ప్రయాణికుల సంఖ్యలో 11 శాతానికి పైగా వృద్ధి లభించింది.
- దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యా పరంగా ఈ ఏడాది జనవరి - నవంబరు నెలల్లో 13.16 కోట్ల మంది ప్రయాణించారు. 2018 ఇదే కాలంలో ప్రయాణించిన 12.63 కోట్ల మందితో పోలిస్తే, ఈసారి 3.86 శాతం అధికంగా ప్రయాణించారు.
సహేతుక ఛార్జీలే శ్రేయస్కరం
విమాన టికెట్ల ధరలు, నిర్వహణ వ్యయాల కంటే తక్కువగా ఉండటం కొనసాగితే మరిన్ని సంస్థలు మూతబడే ప్రమాదం ఉందనే ఆందోళనా సంస్థల నిర్వాహకుల్లో వ్యక్తమవుతోంది. అయితే గిరాకీ ఉంటుందని భావించే సమయాల్లో టికెట్ల ధరలను ముందస్తుగా కూడా ఎక్కువగా చూపడం వల్లే, ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాను చూసుకుంటున్నారని, సహేతుకంగా ఉంచితే, సంస్థలకూ మేలు కలుగుతుందన్నది విశ్లేషకుల మాట.
ఇదీ చూడండి:రివ్యూ 2019: గత ఐదేళ్లలో ఈసారే తక్కువ ఐపీఓలు