అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం 'కాగ్నిజెంట్' వచ్చే మరికొన్ని త్రైమాసికాల్లో దాదాపు 7,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుంచి తప్పుకోనుండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే పునర్‌వ్యవస్థీకరణలో మరో 6,000 మంది ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశముంది.
పోస్టు ఎర్నింగ్ కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా కాగ్నిజెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది కాగ్నిజెంట్. మొత్తం 10,000-12,000 మంది మధ్యశ్రేణి నుంచి సీనియర్ ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని పేర్కొంది. మరో 5,000 మందికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఇతర విధుల్లో చేరుస్తామని వెల్లడించింది.
"కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ మార్పులు మరో 6,000 మంది బాధ్యతలపై ప్రభావం చూపిస్తాయి. వారి బాధ్యతలు మారే అవకాశం ఉంది." అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.
ప్రస్తుతం కాగ్నిజెంట్ కంటెట్ మోడరేషన్ వ్యాపారంలో ఫేస్‌బుక్ వంటి పెద్ద ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. ఈ విభాగం నుంచి వైదొలిగితే కంపెనీ కమ్యూనికేషన్, మీడియా, టెక్నాలజీ విభాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: భారత్లో కొత్తగా మరో 100 విమానాశ్రయాలు!