బ్రిటన్ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ అధిపతి, కుబేర వ్యాపారవేత్త అయిన రిచర్డ్ బ్రాన్సన్ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. జన్యుపరీక్షల్లో తన పూర్వీకుల మూలాలు కొంతమేర తమిళనాడులోని కడలూర్‌లో ఉన్నట్లు తేలిందని బ్రాన్సన్ బుధవారం స్వయంగా వెల్లడించారు.
విమానాల్లో ముత్తాతమ్మ చిత్రపటం
1793 ప్రాంతంలో అక్కడ తమ పూర్వీకులు నివసించినట్లు తెలిపారు బ్రాన్సన్. 35 సంవత్సరాల క్రితం వర్జిన్ అట్లాంటిక్ సంస్థను స్థాపించి, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తన పూర్వీకుల గౌరవార్థం తన ముత్తాతమ్మ అరియా చిత్రపటాన్ని ముంబయి-లండన్ నగరాల మధ్య నిర్వహిస్తున్న తమ విమానాల్లో అమర్చుతున్నట్లు ప్రకటించారు.
'మా పూర్వీకుల్లో 4 తరాల వారు కడలూర్‌లో నివసించారు. మా ముత్తాతమ్మ అరియా ఇక్కడివారే. లాలాజల పరీక్షలోనూ నా భారతీయ మూలాలు నిర్థారణ అయ్యాయి. అందుకేనేమో నేను భారతీయులను కలిసినప్పుడల్లా ‘మనం బంధువులమేమో’ అంటుంటా. ఫ్లైయింగ్ ఐకాన్‌గా మా ముత్తాతమ్మ అరియా చిత్రాన్నే ఉంచుతున్నా. ముంబయి-లండన్ మధ్య మా విమాన సర్వీసు ప్రారంభించడం ఇది మూడోసారి. గతంలో ఈ మార్గం అంత లాభసాటి కాదు. ఇప్పుడు రోజూ నిర్వహించనున్నాం'’ అని తెలిపారు బ్రాన్సన్.
ఇదీ చూడండి: రికార్డు: ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా 'ఆరాంకో'