ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలోశ్(ఏప్రిల్-సెప్టెంబర్).. దాదాపు రూ.1.13 లక్షల కోట్ల విలువైన బ్యాంకు మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకు మోసాల్లో ఇంత వరకు ఇదే అత్యధిక మొత్తమని రిజర్వు బ్యాంకు పేర్కొంది.
4,412 మోసాల విలువ రూ.లక్ష కోట్లకు పైమాటేనని ఆర్బీఐ నివేదిక ద్వారా తెలిసింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి అర్ధభాగంలో.. బ్యాంకు మోసాల సంఖ్య 6,801గా ఉండగా.. వీటి విలువ రూ.71,543 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో బ్యాంకు మోసాలను విశ్లేషించినప్పుడు.. మోసాలు జరిగిన సమయానికి, వాటిని గుర్తించిన సమయానికి జాప్యం ఉన్నట్లు ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక పేర్కొంది.
గత 18 ఏళ్లతో పోలిస్తే..
కేవలం 2019-20 తొలి ఆరు నెలల్లో జరిగిన బ్యాంకు మోసాలు.. 2001 నుంచి 2018 ఆర్థిక సంవత్సరాల తొలి అర్ధభాగంలో జరిగిన బ్యాంకు మోసాలలో 97.3 శాతానికి (విలువ పరంగా) సమానమని తెలుస్తోంది. అదే విధంగా 2018-19 తొలి అర్ధభాగంతో పోలిస్తే.. 90.6 శాతానికి సమానంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో.. 398 బ్యాంకు మోసాల వాటానే అధికమని (ఒక్కో కేసు రూ.50 కోట్లపైమాటే) ఆర్బీఐ పేర్కొంది. వీటి మోత్తం విలువ రూ.1.05 లక్షల కోట్లుగా తెలిపింది. వీటిలో 21 మోసాలు.. రూ.వెయ్యి కోట్లకు పైమాటేనని బ్యాంకులు నివేదికలో పేర్కొన్నాయి. వీటి మొత్తం విలువ రూ.44,951 కోట్లు.
కేంద్ర బ్యాంకు మోసాల జాబితా డేటాబేస్ ఆధారంగా.. బ్యాంకింగేతర రుణ సంస్థలు, సహకార బ్యాంకుల మోసాలను ఏకీకృతం చేసేందుకు.. ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. దీని ద్వారా బ్యాంకు మోసాలను గుర్తించడం మరింత సులభమవుతుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ప్రభుత్వ విధానాలను మరింత నమ్మకంగా అందించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.