కరోనా విజృంభణ, రాష్ట్రాల వారీగా లాక్డౌన్ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు తమ వినియోగదారులకు పలు విషయాల్లో ఊరటనిస్తున్నాయి. వాహనాల వారంటీ, సర్వీస్ గడువును పెంచుతున్నాయి.
బజాజ్ ఆటో ఫ్రీ సర్వీస్ జులై 31 వరకు..
ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్య వారంటీ, సర్వీస్ ముగియనున్న అన్ని మోడళ్లకు జులై 31 వరకు గడువు పెంచుతున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. ద్విచక్ర వాహనాలతో పాటు వాణిజ్య వాహనాలకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది.
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలకూ..
ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య సర్వీస్, వారంటీ ముగియనున్న వాణిజ్య వాహనాలకు మరో నెల గడువు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 1-మే 31 మధ్య కాలంలో వారంటీ, ఉచిత సర్వీస్ ముగియనున్న ప్యాసింజర్ వాహనాలకు జూన్ 30 వరకు గడువు పెంచినట్లు టాటా మోటార్స్ ఇదివరకే ప్రకటించింది.
ఇదీ చదవండి:వినియోగదారులకు 'కేటీఎం బైక్స్' శుభవార్త