అమెరికాకు చెందిన మరో ఐటీ దిగ్గజానికి భారత సంతతికి చెందిన వ్యక్తి సారథ్యం వహించనున్నారు. టెక్ దిగ్గజం ఐబీఎంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా(సీఈఓ) అరవింద్ కృష్ట ఎంపికయ్యారు.
ఐబీఎం నూతన సీఈఓ, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా ఎన్నుకుంటూ.. ఇతర సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 6న సీఈఓ బాధ్యతలు తీసుకోనున్నారు కృష్ణ. అరవింద్ (57) ప్రస్తుతం కంపెనీ ‘క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఐబీఎం ప్రస్తుత ఛైర్మన్, అధ్యక్షురాలు, సీఈఓ గిన్నీ రోమెట్టీ (62) ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ పొందనున్నారు. రోమెట్టీ గత 40 ఏళ్లుగా ఐబీఎంలో పని చేస్తున్నారు. రోమెట్టీ పదవీ విరమణ నేపథ్యంలో అరవింద్ కృష్ణను తదుపరి సీఈఓగా ఎంపిక చేసింది సంస్థ డైరెక్టర్ల బోర్డు. ఐబీఎం అధ్యక్షుడిగా జిమ్ వైట్‌హస్ట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిన్నీ కొనసాగనున్నారు.
ఆయనే సమర్థులు..
ప్రపంచ టెక్ దిగ్గజంగా వెలుగొందుతున్న ఐబీఎంకు తదుపరి సీఈఓగా అరవింద్ కృష్ణ సమర్థులని రోమెట్టీ అన్నారు. ఐబీఎం నవ శఖానికి ఆయనే సరైన సారథిగా అని కొనియాడారు. రెడ్ హ్యాట్ వంటి ఇతర కంపెనీలను సంస్థలను స్వాధీనం చేసుకోవడంలో అరవింద్ పాత్ర కీలకమైనదిగా ఆమె తెలిపారు.
భారత సంతతి టెక్ సారథుల జాబితా..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల, గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్‌పిచాయ్, మాస్టర్‌కార్డ్ సీఈఓగా అజయ్ బంగ, అడోబ్ సీఈఓగా శంతనూ నారాయణ్‌లు ఉన్నారు. మరో దిగ్గజ సంస్థ పెప్సికోకు ఇంద్రనూయి గతంలో సీఈఓగా పని చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో అరవింద్ కృష్ణ చేరారు.
ఐబీఎంతో అరవింద్ ప్రయాణం..
1990 నుంచి ఐబీఎంలో ఉన్నారు అరవింద్ కృష్ణ. ఐఐటీ కాన్పుర్ నుంచి డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పొందారు.
గొప్ప గౌరవం..
ఐబీఎం సీఈఓ పదవికి ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు అరవింద్ కృష్ణ తెలిపారు.
"ఐబీఎం తదుపరి సీఈఓగా ఎన్నికవ్వడం పట్ల నేను గౌరవంగా భావిస్తున్నాను. గిన్నీ, ఇతర బోర్డు సభ్యులు నా పై నమ్మకం ఉంచడం అభినందనీయం." - అరవింద్ కృష్ణ
ఇదీ చూడండి:పార్లమెంటు ఉభయ సభల్లో నేడే ఆర్థిక సర్వే