దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 1.17 బిలియన్లకు పెరిగింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' గణాంకాల్లో ఈ విషయం వెల్లడింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీ ఎయిర్‌టెల్‌కు వరుసగా రెండో నెలలోనూ(అక్టోబర్‌లో) అత్యధికంగా 30.6 లక్షల మంది కొత్త యూజర్లు పెరిగారు. అక్టోబర్ నెలకుగాను.. కొత్త యూజర్ల పెరుగుదలలో 20.2 లక్షల మందితో రిలయన్స్ జియో రెండో స్థానంలో నిలించింది. వీ(వొడాఫోన్ ఐడియా) మాత్రం అక్టోబర్‌లో 20.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
మార్కెట్ లీడర్‌గా జియో..
మొత్తం మీద అక్టోబర్‌లో 40.6 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది. ఎయిర్టెల్ 33.02 కోట్ల మంది యూజర్లు 29 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. 29.3 కోట్ల మంది యూజర్లు, 25 శాతం మార్కెట్ వాటాతో వీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
యాక్టివ్ యూజర్ బేస్ పరంగా.. 97 శాతంతో ఎయిర్టెల్ అగ్రస్థానంలో నిలిచింది. 89 శాతంతో వీ రెండో స్థానంలో ఉంది. జియో మాత్రం 79 శాతానికి పరిమితమై మూడో స్థానంలో ఉన్నట్లు ట్రాయ్ వివరించింది.
వైర్‌లైన్‌లో బీఎస్ఎన్ఎల్ టాప్..
వైర్‌లైన్ సేవల్లో రిలయన్స్ జియోకు అక్టోబర్‌లో కొత్తగా 2.46లక్షల మంది యూజర్లు పెరిగారు. దీనితో మొత్తం యూజర్ల సంఖ్య 20.3 లక్షలకు చేరింది. అదే నెలలో ఎయిర్‌టెల్‌కు 48 వేల మంది యూజర్లు పెరిగారు. మొత్తం యూజర్ల సంఖ్య 40.4 లక్షలు దాటింది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు 1.76లక్షల మంది యూజర్లు పెరిగి.. మొత్తం 70.5 లక్షల మంది వినియోగదారులతో ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి:అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ దర్యాప్తు