సంక్షోభంలో చిక్కుకున్న.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాపై కీలక వ్యాఖ్యలు చేశారు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ జరగకపోతే.. పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు రాజ్యసభలో పేర్కొన్నారు.
అయితే ఉద్యోగులందరికీ మేలు చేసే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
గతంలో ప్రయత్నం చేసినా..
ఎయిర్ఇండియాలో పూర్తి వాటాను విక్రయించేందుకు.. బిడ్లను ఆహ్వానిస్తోంది. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణకు వచ్చే ఏడాది మార్చి 31ని తుది గడువుగా పెట్టుకుంది ప్రభుత్వం.
2018లోనే మోదీ తొలి ప్రభుత్వం.. ఎయిర్ ఇండియాలో 75 శాతం వాటా విక్రయించేందుకు బిడ్లు ఆహ్వానించింది. అయితే అందుకు ఏ ప్రైవేటు కంపెనీ ముందుకు రాలేదు. ఈ కారణంగా మళ్లీ అ దిశగా ప్రయత్నాలు జరగలేదు.
ఎయిర్ఇండియా ఛైర్మన్ అశ్వనీ లోహానీ సహా.. విమానయాన మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నారు. గతవారం మంత్రుల బృందం చర్చించి.. ఎయిర్ఇండియాపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు హర్దీప్ పూరి తెలిపారు.
రాజ్యసభ సభ్యుల్లో ఒకరు.. ప్రైవేటీకరణకు ముందే పైలట్లు సంస్థలను వీడితే.. అని అడిగిన ప్రశ్నకు ఆయన ప్రతికూల సమాధానమిచ్చారు.
ఎయిర్ఇండియా ప్రభుత్వం అండతోనే నడుస్తోందని.. యూపీఏ II ప్రభుత్వంలోనూ రూ.30,000 కోట్ల ప్యాకేజీని ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇదీ చూడండి:'అనుమతిలేని పనులు కార్వీ చేసింది':సెబీ