'రిలయన్స్ జియో 4జీ' రాకతో విప్లవాత్మక మార్పుల కారణంగా.. పలు టెలికాం సంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని సంస్థలు విలీనమై మనుగడ సాగిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి తెరలేపింది రిలయన్స్. 'జియో ఫైబర్' ప్రీమియం ద్వారా కొత్త సినిమాను నేరుగా ఇంట్లోనే చూడొచ్చు. అదే రోజు ఆ చిత్రాలు థియేటర్లలో ప్రదర్శితమవుతాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు ముకేశ్ అంబానీ.
తమకు పోటీగా ఉన్న ఈ విధానంపై సినిమా హాల్ యాజమాన్యాలు స్పందించాయి. జియో చెప్పినట్లే ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినా తమ వ్యాపారాలు సజావుగానే సాగుతాయని ధీమాగా ఉన్నాయి.
రెండూ వేర్వేరు అనుభవాలే: పీవీఆర్
థియేటర్లో కూర్చొని సినిమా చూడటం, ఇంట్లో సినిమా చూడటం రెండు వేర్వేరు అనుభూతులు అని.. దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ 'పీవీఆర్' తెలిపింది. సినిమా థియేటర్లను విస్తరించడం ద్వారా వ్యాపారాల్లో వృద్ధి ఉంటుందని పేర్కొంది.
ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 800 స్క్రీన్లు ఉన్నాయి.
అలా చేస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే: ఐనాక్స్
భారత్‌లో సినిమా విడుదలైన.. 8 వారాల తర్వాతే ఇతర ప్లాట్‌ఫాంలలో(ఓటీటీ, టీవీల్లో) ప్రసారం చేయాలి. ఇందుకు నిర్మాతలు, పంపిణీదారులు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు పరస్పరం అంగీకరించుకున్నాయనే విషయాన్ని 'ఐనాక్స్' సంస్థ గుర్తు చేసింది. ఐనాక్స్కు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లు ఉన్నాయి.
సినిమాపై నిర్మాతకే సర్వహక్కులూ ఉంటాయి. తమ సినిమాను థియేటర్లో విడుదల చేయాలా? ఇతర ఫ్లాట్ ఫాంలలో ప్రసారానికి అనుమతివ్వాలా? అనేది వారి నిర్ణయంపైనే ఆధారపడుతుంది. అయితే ఏకకాలంలో రెండింటిలో ప్రసారానికి అనుమతిస్తే అది నిబంధనల ఉల్లంఘనేనని ఐనాక్స్ పేర్కొంది.
జియో ఇటీవలి ప్రకటనతో బీఎస్ఈలో పీవీఆర్ షేర్లు 2.45 శాతం, ఐనాక్స్ షేర్లు 2 శాతం మేర నష్టపోయాయి.
నిర్మాతల మాట ఇది....
"అందరూ ఒకే అంశంపై చర్చిస్తున్నారు. ఇందుకు కారణం... ఇంట్లోనే సౌకర్యవంతంగా విడుదలైన కొత్త సినిమాను చూడటంపై అంబానీ చేసిన ప్రకటన. ఇది అధునాతన సాంకేతికత. కచ్చితంగా ఇది సమూల మార్పులు తీసుకువస్తుంది. పరిశ్రమకు సరికొత్త సవాలునూ విసురుతోంది. సినీ పరిశ్రమ, కార్పొరేట్ సినిమాలు ఎలా తమను తాము మలుచుకోవాలో నేను అర్థం చేసుకోగలను. నేను నమ్మేదేంటంటే.. సినిమాలు తీసేవాళ్లు.. ప్రాక్టికల్ సినిమాలు ఎక్కువగా తీయాలి. జనాలు సినిమా హాల్లోనే ఆ సినిమాను ఆస్వాదించేలా నిర్మించాలి. పరిశ్రమలో ఇది కొత్తేం కాదు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అవి ఎక్కువగా ఇంట్లో ఒక గదికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇంట్లో కూర్చుని కొత్త చిత్రాలు చూడటమనే అనుభూతి కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే... అంబానీ చెప్పిన ఈ నూతన సాంకేతికత కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నాం."
-ప్రసాద్. వి. పొట్లూరి, తెలుగు సినీ నిర్మాత
ఇదీ చూడండి: జియో కోసం మైక్రోసాఫ్ట్‌తో జతకట్టిన అంబానీ