ఈ ఏడాది ఇప్పటికే ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్ట్రా మోడళ్లతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది చైనా దిగ్గజ మొబైల్ సంస్థ షియోమీ. తన తదుపరి మోడల్లో 200 మెగాపిక్సెల్ కమెరాతో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఎంఐ12ను మార్కెట్లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎంఐ 12లో అధునాతన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కూడా వినియోగించాలని షియోమీ భావిస్తోంది. గతేడాది స్నాప్‌డ్రాగన్ 888 5జీ చిప్‌సెట్‌ను ప్రకటింటినప్పుడు.. దీన్ని వినియోగించిన తొలి సంస్థ కూడా షియోమీనే కావడం గమనార్హం. ఎంఐ 11 మోడల్లో ఈ చిప్‌సెట్‌నే ఉపయోగించింది. అయితే క్వాల్కామ్ తొలి 4ఎన్ఎం చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 895ను కూడా షియోమీనే మొదటగా ఎంఐ 12 మోడల్లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
ఎల్టీపీఓ(లో టెంపరేఛర్ పాలీక్రిస్టలిన్ ఆక్సైడ్)ను సపోర్ట్ చేసే ఓఎల్ఈడీ డిస్ప్లేను ఎంఐ-12 మోడల్లో వాడనున్నారు. దీనివల్ల రీఫ్రెష్ రేట్ తగ్గి బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 100 వాట్స్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతతో ఎంఐ 12 బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎంఐ-12 ధర ఎంత ఉండవచ్చనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.