కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా.. ఇలా తమ జీవితంలో ఎన్నో పాత్రలను పోషిస్తున్నారు మహిళలు. వృత్తిపరంగానూ రాణిస్తూ అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం మహిళలు ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉందని చెబుతూ పేటీఎం సంస్థ ఒక సామాజిక ప్రయోగం చేసింది. ఇందులో భాగంగా వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడిన అన్ని వయసుల స్త్రీ- పురుషులను, గృహిణులను.. ఇలా మొత్తంగా 30 మందిని ఎంపిక చేసింది. ముందుగా వారందరినీ ఒకే గీత మీద నిలబెట్టి... అక్కడున్న ఓ హోస్ట్ వారికి వివిధ రకాల ప్రశ్నలు సంధిస్తారు. వాటికి సమాధానం ‘ఎస్’ అయితే నిల్చున్న స్థానం నుంచి ఒక అడుగు ముందుకు, ‘నో’ అయితే ఒక అడుగు వెనక్కి వేయాలని చెబుతారు.
వీటిలో పురుషులతో సమానంగా!
- మీకోసం కాకుండా ఎప్పుడైనా టీ, బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశారా?
- పదేళ్లలోపే సైకిల్ తొక్కారా?
- స్కూల్‌లో సంగీతం నేర్చుకున్నారా?
- ఏదైనా క్రీడలో శిక్షణ తీసుకున్నారా? (వీడియో గేమ్స్‌లో గేమ్ అనే పదం ఉన్నప్పటికీ అది స్పోర్ట్స్ పరిధిలోకి రాదనడంతో అందరి ముఖాల్లో నవ్వులు)
- చదువుకునేటప్పుడు మీ దుస్తులను మీరు ఐరన్ చేసుకున్నారా?.. లాంటి ప్రశ్నలకు మగవారితో సమానంగా మహిళలు ‘ఎస్’ అంటూ అడుగు ముందుకేస్తారు.
ఆర్థిక అంశాల్లో ఇంత అంతరమా?
- ఇంటి నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ మీరే చెల్లిస్తారా?
- మీ ప్రాంతంలో భూమి ధర ఎంత పలుకుతుందో మీకు తెలుసా?
- ఈ రోజు బంగారం ధర ఎంతో తెలుసా?
- మీ జీతంలో నెలవారీ కోత ఎంత ఉంటుంది?
- మిమ్మల్ని సంతకం చేయమన్న ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ గురించి ముందు పూర్తిగా తెలుసుకుంటారా?
- ఎవరినీ సంప్రదించకుండా మీ పేరు మీద వాహనం తీసుకున్నారా?
- ఇతరుల సాయం లేకుండా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారా?
- బడ్జెట్‌కు సంబంధించిన వార్తలు, విషయాలు చూసి పాటిస్తారా?
- మీరొక్కరే మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దుకోగలరా?
- మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలుసా?
- మ్యూచువల్ ఫండ్స్, సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)కు తేడా ఏమిటి?
- మీ కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి పేరుతో ఏమైనా పెట్టుబడులు పెట్టారా?
- మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను మీరే దాఖలు చేస్తారా?..
ఇలా డబ్బుతో ముడిపడిన ప్రశ్నలకు మాత్రం మహిళల వద్ద ఎలాంటి సమాధానం దొరక్కపోగా వారు అడుగు వెనక్కి వేస్తారు. ఇలా అన్ని ప్రశ్నలు పూర్తయ్యే సరికి మగవారందరూ ముందుంటే, మహిళలు మాత్రం ఏ గీత నుంచి మొదలయ్యారో ఆ గీత వద్దకే చేరుకుంటారు. ‘ప్రారంభంలో పురుషులు, మహిళల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు!’ అంటూ వారి మధ్య ఉన్న అంతరాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తాడు హోస్ట్.
మహిళలందరూ ఈ వీడియో చూడాల్సిందే!
గతంతో పోల్చితే ఆర్థిక సమానత్వం, అక్షరాస్యత విషయాల్లో మహిళలు ఎంతో మెరుగైనప్పటికీ... సాధించాల్సింది చాలా ఉందని ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. అమ్మాయిలందరికీ ఆర్థిక సాధికారతతో పాటు, ఆర్థిక అంశాల్లో లోతైన అవగాహన ఎంతో అవసరమన్న విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది. ఈక్రమంలో ‘డివైడెడ్’ పేరుతో చేసిన ఈ కార్యక్రమాన్ని పేటీఎం సంస్థ ఓ హ్యాష్‌ట్యాగ్‌తో తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోనూ, సోషల్ మీడియా ఖాతాల ద్వారా అందరితో షేర్ చేసుకుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటివరకు 19 లక్షల మందికిపైగా చూడడం విశేషం. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ‘మహిళలందరూ కచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది!’ అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ యాడ్‌ను షేర్ చేసింది. ఆమెతో పాటు మోనికా హెలెన్, ప్రియాంకా చతుర్వేది, కునాల్ షా...తదితర ప్రముఖులతో పాటు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అద్భుతమైన వీడియో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సంస్థ నిర్వహించిన ఈ సామాజిక ప్రయోగంలో కేవలం 30 మంది పురుషులు, స్త్రీలు మాత్రమే పాల్గొన్నారు. హోస్ట్ కూడా కొన్ని రకాల ప్రశ్నలను మాత్రమే సంధించారు. కాబట్టి ఈ ఒక్క ప్రయోగం ఆధారంగా ఆర్థిక సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రం ,ఆర్థిక అంశాల్లో అవగాహన వంటి విషయాల్లో మహిళల శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయలేమని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ స్పందనేంటి? ఆర్థిక విషయాల్లో మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారంటారా? మీ అమూల్యమైన అభిప్రాయాలను, విలువైన సలహాలను కింది కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి.
ఇదీ చదవండి: కేంద్రం దిగిరాకపోతే ప్రజా ఉద్యమంగా మారుస్తాం: బ్యాంక్ ఉద్యోగులు