కారణాలు ఏమైనాగానీ.. దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా కొన్ని పైసలు తగ్గాయి. అంతే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ భారీ ఓడ పెట్రోల్ ధరల పతనానికి అడ్డంపడింది. భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా అయ్యే ఓ మార్గాన్ని వారం రోజులుగా మూసేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. దీంతో మన దేశంలోని కంపెనీలు చమురు ధరల తగ్గింపును మళ్లీ నిలిపేశాయి. ఇక ప్రపంచం విషయానికి వస్తే ఒక్క చమురే కాదు.. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆహారం, నిత్యావసరాలు, దుస్తులు, ఆటోమొబైల్ వంటి వాటిపై ఈ ప్రభావం పడనుంది. దీంతో ప్రపంచ వాణిజ్యాన్ని భయపెట్టిన అతిపెద్ద ప్రమాదంగా దీనిని పేర్కొనవచ్చు.
ఈ కెనాల్ నుంచి మన చమురే అత్యధికం..
భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశం ఇరాక్. ఆ తర్వాత స్థానాన్ని ఇటీవలే అమెరికా ఆక్రమించింది. దీంతోపాటు లాటిన్ అమెరికా దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకొంటుంది. ఈ చమురు మొత్తం సూయిజ్ కెనాల్ నుంచే వస్తుంది. వాస్తవంగా కెనాల్ నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకొనేది కూడా భారత్ దేశమే. ఈ మార్గంలో మనకు నిత్యం 5,00,000 పీపాల చమురు వస్తుంది. అదే చైనాకు 4,00,000 పీపాల చమురు వెళుతుందని వోర్టెక్సా లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ద.కొరియా, సింగపూర్ ఉన్నాయి. ఇక చమురు ఉత్పత్తులను ఈ మార్గంలో అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ది ఆరోస్థానం. దీంతో భారత్ ఆ మేరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా చేయించుకోవాలి. కాకపోతే సూయిజ్ వద్ద భారీగా చమురు ట్యాంకర్లు చిక్కుపోయాయి. దీంతో ట్యాంకర్ల కొరత ఏర్పడి రవాణా ఛార్జీలు పెరగవచ్చు. అంటే ట్యాంకర్ల ఛార్జీలు.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ప్రయాణించడం వల్ల చేరే అదనపు దూరం ఖర్చులు కూడా చమురు వినియోగదారులపైనే పడనున్నాయి. సూయజ్ కాల్వ నుంచి భారత్ 200 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తుంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సరుకుల్లో జాప్యం కానుంది. దీంతోపాటు రవాణా ఛార్జీలు 5-15శాతం వరకు పెరగవచ్చు.
కంటైనర్లకు భారీ కొరత..
రవాణ ఓడల్లో ఉపయోగించే కంటైనర్లకు తీవ్రమైన కొరత ఏర్పాడింది. వాస్తవానికి ప్రపంచ రవాణలో 90 శాతం సరుకులు ఇలాంటి కంటైనర్లలోనే పెట్టి సురక్షితంగా పంపిస్తుంటారు. సరుకును దిగుమతి చేశాక.. వీటిని మరో సరుకు కోసం వినియోగిస్తారు. కరోనా భయంతో చాలా ఓడల అన్‌లోడింగ్‌ను గతేడాది ఆలస్యం చేశారు. దీంతో భారీగా కంటైనర్లు చిక్కుకుపోయాయి. కంటైనర్లను అత్యధికంగా చైనాలోనే తయారు చేస్తున్నారు. కరోనా కారణంగా ఆర్డర్లు లేక గతేడాది తొలి ఆరునెలలు చైనాలో వీటి ఉత్పత్తి తగ్గింది. ఓడరేవుల్లో లక్షల కొద్దీ కంటైనర్లు ఖాళీగా ఉన్నాయని 'చైనా ఇంటర్నేషనల్ మెరైన్ కంటైనర్ కో' సంస్థ తన న్యూస్ లెటర్‌లో పేర్కొంది. కానీ, ఆ తర్వాత నుంచి డిమాండ్ పుంజుకొంది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సప్లై ఛైన్ల నుంచి వీటికి డిమాండ్ పెరిగింది. ఏటా 2.5కోట్ల కంటైనర్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసినా.. కొరతను తగ్గించలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కంటైనర్ తయారీ ధర కూడా పెరిగింది. తాజాగా సూయజ్ కెనాల్ వద్ద దాదాపు 450 భారీ ఓడలు నిలిచిపోవడంతో వాటిపై ఉన్న కంటైనర్లు వెంటనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా వీటి అద్దెలు కూడా పెరిగిపోయే పరిస్థితి నెలకొంది.
ఐరోపా వాహన తయారీ దారులకు ఇబ్బందే..
వాహన తయారీ రంగంలో ఐరోపాది ప్రత్యేక స్థానం. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే విలాసవంతమైన బ్రాండ్లు దాదాపు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి. ఆసియా దేశాలకు డుకాటీ బైకుల సరఫరాలో కొంత ఆలస్యం జరగవచ్చని కంపెనీ పేర్కొంది. పంపిణీ వ్యవస్థల్లో జాప్యమే దీనికి కారణమని కంపెనీ సీఈవో క్లౌడియో డొమెన్సియల్ తెలిపారు. కరోనా సమయంలో తాము పడిన ఇబ్బంది సుయజ్ కెనాల్ సమస్యతో మరింత తీవ్రమైందని తెలిపారు. దీంతో విమానాల్లో వాహనాల ఎగుమతి విషయాన్ని పరిశీలిస్తున్నారు.
ఆసియా-ఐరోపా వాణిజ్యానికే దెబ్బ..
సూయజ్ కాల్వ నిలిచిపోవడంతో అత్యధికంగా ఆసియా-ఐరోపా వాణిజ్యంపైనే ప్రభావం చూపనుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయిస్తే రద్దీగ ఉండే సింగపూర్-రోటర్‌డ్యామ్ మార్గంలో వేల నాటికల్ మైళ్ల తేడా వచ్చేస్తుంది. సూయజ్ మార్గం ద్వారా వెళ్తే.. 34 రోజుల పాటు 8,301 నాటికల్ మైళ్లు ప్రయాణించాలి. అదే కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మార్గంలో వెళితే.. 43 రోజుల పాటు 11,750 నాటికల్ మైళ్లు ప్రయాణించాలి. అదనపు రోజుల ప్రయాణానికి నౌకలకు 800 టన్నులకు పైగా చమురు ఖర్చవుతుంది. ఇది మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. ఈ మార్గంలో ఆసియా నుంచి ఎలక్ట్రానిక్స్, దుస్తులు, భారీ యంత్ర పరికరాలను తరలిస్తారు. జనరల్ మోటార్స్, టొయోటా మోటార్స్, హోండా మోటార్స్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు దీంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
ఇవీ చూడండి: