ఏదైనా వస్తువు కొనుగోలుకు ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించే స్తోమత లేనప్పుడు ఈఎంఐ రూపంలో దానిని సొంతం చేసేందుకు వీలుంటుంది. అయితే ఈ పద్ధతిలో వస్తువు వాస్తవ ధరతో పాటు కొంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ సమస్య లేకుండా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఈ-కామర్స్ పోర్టళ్లు, ప్రధాన రిటైల్ మాల్స్ అందిస్తున్నాయి. దీని ద్వారా వినియోగదారుడు నిర్ణీత ఈఎంఐలలో చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు అమెజాన్లో రూ. 40వేలు ఉన్న ఒక ఫోన్ను కొనుగోలు చేస్తే.. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా 3 లేదా 6 ఈఎంఐలలో మొత్తాన్ని చెల్లించవచ్చు. వినియోగదారుడు ఎలాంటి అదనపు ఛార్జీలు, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారుడిపై ఎలాంటి ప్రభావం లేకపోయినప్పటికీ వడ్డీ అనేది ఇందులో ఉంటుంది.
వడ్డీ మొత్తం డిస్కౌంట్..
ఆర్బీఐ నిబంధనల ప్రకారం వడ్డీ లేని రుణాలు ఇవ్వకూడదు. పారదర్శక, న్యాయ వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న ఉద్దేశంతో 2013లో వడ్డీ లేని రుణాల పథకాలను నిషేధించింది ఆర్బీఐ. అందుకే సున్నా వడ్డీ అని చెబుతున్నప్పటికీ.. ఇతర ఛార్జీల రూపంలో వీటిని రాబడుతున్నాయి ఆయా రుణ సంస్థలు.
- ముందుగా డిస్కౌంట్ ప్రకటించి.. దానినే తిరిగి వడ్డీ రూపంలో వసూలు చేస్తుంటాయి. దీని వల్ల అంతిమంగా వినియోగదారుడికి వడ్డీ భారం పడదు.
- అన్ని కార్డుల ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకునే వీలుండదు.
- ఐసీఐసీఐ కార్డుతో అమెజాన్ లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
- బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కొన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో ఈఎంఐ రూపంలో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. అయితే ఇందులో అన్నీ నో కాస్ట్ ఈఎంఐలు కావు.
- నో కాస్ట్ ఈఎంఐ సేవలు అందించే కార్డులు వినియోగదారుడి క్రెడిట్ స్కోరును చెక్ చేస్తాయి. రిపోర్టు పొందేందుకు అయ్యే ఛార్జీలను వినియోగదారుడి నుంచే వసూలు చేస్తాయి.
వినియోగదారులకు ఉపయోగమేనా?
వినియోగదారుల దృష్టిలో నో కాస్ట్ ఈఎంఐ అనేది ఎంతో సహాయపడుతుంది. అదనపు ఛార్జీలు లేకుండా, పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒక వస్తువును కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ సదుపాయంతో ఈ-కామర్స్ సైట్లలో కొనుగోళ్లు కూడా భారీగా జరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో.. మొబైల్ ఫోన్లు, టీవీల వంటి వాటిని నో కాస్ట్ ఈఎంఐ ద్వారా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
అయితే నో కాస్ట్ ఈఎంఐ ద్వారా వినియోగదారులు వడ్డీ చెల్లించరు కాబట్టి.. ఈ-కామర్స్ సైట్లలో ఉత్పత్తులు అమ్ముకునే విక్రేతలు భరిస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వారికి ఆ ఉత్పత్తులు అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని ఇలా వదులుకుంటారు.
జాగ్రత్తల వహించాలి?
నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేసే ముందు పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా కొనుగోలు మొత్తాన్ని ఈఎంఐకి మార్చుకునేందుకు ఛార్జీలు ఉంటాయి. పేరు నో కాస్ట్ ఈఎంఐ అని ఉన్నప్పటికీ.. ఈ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. దీని గురించి కొనుగోలుకు ముందే స్పష్టత తీసుకోవాలి.
ఇది కాకుండా ఇతర వేరే పేర్లతో ఏమైనా ఛార్జీలు ఉన్నాయా? లేదా? తెలుసుకోవాలి. ఒకవేళ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అయితే వసూలు చేసే ఛార్జీల గురించి కూడా ముందే తెలుసుకోవాలి.
ఇవీ చదవండి: