వాట్సాప్ ద్వారా ప్రమాదకర సైబర్ దాడులు జరిగుతున్నట్లు భారత సైబర్ భద్రతా సంస్థ హెచ్చరించింది. వినియోగదారుల నుంచి ఎలాంటి అనుమతులు కోరకుండా ఈ వైరస్లు యాప్‌లోకి చొరబడగలవని.. ఎక్కువగా డాట్(.) ఎంపీఫోర్ ఫైళ్ల ద్వారా దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) పేర్కొంది.
ఇటీవలే ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారతీయుల వాట్సాప్‌లలో చొరబడిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు చేసింది సీఈఆర్టీ-ఇన్. వాట్సాప్‌లో ఉన్న లోపాలను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు ప్రమాదకర వీడియో ఫైళ్లతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపింది. వినియోగదారుడి అనుమతి లేకుండానే ఈ ఫైళ్లు డౌన్లోడ్ అవుతాయని వెల్లడించింది. ఆండ్రాయిడ్‌లో 2.19.274, ఐఓఎస్‌లో 2.19.100కు ముందున్న వర్షన్లలో సగానికిపైగా సాఫ్ట్వేర్లపై ఈ దాడి ప్రభావం కనిపించినట్లు పేర్కొంది.
ఎలా ఎదుర్కోవాలి
వాట్సాప్‌ను తాజా వర్షన్‌లోకి అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇటువంటి దాడుల నుంచి తప్పించుకోవచ్చని సీఈఆర్టీ-ఇన్ సూచించింది.