ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగే ఆవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తొన్న నేపథ్యంలో మార్కెట్లపై ప్రతికూల అంచనాలు వేస్తున్నారు. అయితే మరోవైపు ఇటీవలే భారీ నష్టాలు నమోదు చేసిన నేపథ్యంలో ఉపశమనం కూడా కలిగే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.
కరోనా భయాలతో గత వారం చివరి సెషన్లో సెన్సెక్స్ 3,473 పాయింట్లకుపైగా నష్టాన్ని.. నిఫ్టీ 1,134 పాయింట్లు క్షీణించింది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా ట్రేడింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. బీఎస్ఈ మదుపరుల సంపద రూ.15 లక్షల కోట్లు అవిరైంది.
స్టాక్ మార్కెట్ మదుపరులు ఈ వారం.. కరోనా వైరస్ ప్రభావం సహా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపైనా దృష్టి సారించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వారంలోనే వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ బ్యాంకు కీలక ప్రకటన చేయనుంది.
"మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకునేందుకు కాస్త సమయం పట్టొచ్చు. మధ్య మధ్యలో ఉపశమనం కలుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఒడుదొడుకులు ఉన్న సమయంలో రిటైల్ ఇన్వేస్టర్లు ఆందోళన చెందకుండా స్థిరంగా ఉండటమే మేలు." - సిద్ధార్థా ఖింకా, రిటైల్ రీసర్చ్ అధిపతి, మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్.
టోకు ద్రవ్యోల్బణం గణాంకులు రేపు ప్రకటించనుంది కేంద్ర గణాంక కార్యాలయం. ఈ లెక్కలూ మదుపురుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
తాత్కాలిక ఉద్దీపనలతో మార్కెట్లలో కాస్త సానుకూలతలు వచ్చినప్పటికీ మదుపరులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. మంచి క్వాలిటీ స్టాక్లను ఎంచుకోవడమే మేలంటున్నారు.
ఇదీ చూడండి:సౌదీ ఆరాంకో లాభాలకు భారీగా గండి.. కారణమదే