Union Budget 2022: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. గత రెండేళ్లుగా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం నుంచి పూర్తిగా బయటపడకముందే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ.. ఆర్థిక పునరుత్తేజానికి అడ్డుగోడలుగా మారుతున్నాయి. ద్రవ్యలోటు, జీడీపీ.. ద్రవ్యోల్బణం.. ఇలా ఎన్నో సవాళ్ల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందూ ఎన్నడూ చూడని బడ్జెట్‌ను చూస్తారని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. డిమాండ్‌ను పెంచడం, ఉద్యోగ కల్పన కోసం ఈ బడ్జెట్‌లో ఆర్థిక లోటు ఆందోళనలు పక్కనబెట్టి వ్యయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ దృక్పథాన్ని తన బృందానికి వెల్లడించి సరైన ప్రతిపాదనలు చేయించడంలో ఆర్థిక మంత్రి అత్యంత చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆ బృందం కూడా అత్యంత చతురతతో పనిచేయాలి. మరి ఈ సారి మన నిర్మలమ్మ బడ్జెట్ టీంలో ఉన్న కీలక వ్యక్తులెవరో తెలుసుకుందాం..
నిర్మలా సీతారామన్(ఆర్థిక మంత్రి)
మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను చేపట్టారు నిర్మలా సీతారామన్. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. ఇప్పటివరకు మూడు సార్లు బడ్జెట్‌ను ప్రకటించిన నిర్మలమ్మ.. నాలుగోసారి బడ్జెట్ ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన నిర్మల.. సేల్స్ గర్ల్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో లండన్‌లోని ఓ స్టోర్‌లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్‌లో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు.
టీవీ సోమనాథన్ (ఆర్థిక కార్యదర్శి, ఎక్స్‌పెండిచర్ కార్యదర్శి)
కలకత్తా యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన సోమనాథన్ ప్రపంచ బ్యాంక్‌లో పనిచేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు. బడ్జెట్ బృందంలోని కీలక వ్యక్తుల్లో అత్యంత సీనియర్ ఈయనే. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో వృథా వ్యయాలు తగ్గించి ప్రభుత్వ ఖర్చులను హేతుబద్ధీకరించాల్సిన బాధ్యత ఈయనపై ఉంది. ప్రభుత్వం ప్రకటించే పథకాల వ్యయాలను అంచనా వేసేది ఈయనే. మరి ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వ ఖర్చులను ఎలా రూపొందించారో చూడాలి.
తరుణ్ బజాజ్ (రెవెన్యూ కార్యదర్శి)
తరుణ్ బజాజ్.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆర్థికశాఖకు బదిలీ అయ్యారు. పబ్లిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషన్‌లో సుదీర్ఘంగా 31 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. మహమ్మారి సమయంలో ఆరోగ్య రంగానికి ఉద్దీపనలు ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది ఆయన ముందున్న లక్ష్యం.. వాస్తవిక పన్ను లక్ష్యాలను నిర్దేశించడం. పన్ను వసూళ్లను పెంచడంతో వైరస్ ప్రభావానికి గురైన వ్యాపారాలకు ప్రత్యేక పథకాలను ప్రకటించే బాధ్యత ఆయనపై ఉంది.
అజయ్ సేథ్ (ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి)
గతేడాది ఏప్రిల్‌లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా కేంద్ర ఆర్థిక శాఖలో చేరారు అజయ్ సేథ్. అంతకుముందు బెంగళూరు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. దేశ జీడీపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రైవేటు మూలధన వ్యయాలను పునరుద్ధరించాల్సిన కీలకమైన బాధ్యతను భుజానెత్తుకున్నారు. ఈసారి.. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాన్ని డ్రాఫ్టింగ్ చేసేది కూడా ఈయనే. క్యాపిటల్ మార్కెట్, పెట్టుబడులు, మౌలిక సంబంధిత విధానాలపై ఈయన పనిచేయనున్నారు. ఉపాధిని సృష్టించి రెవెన్యూ పెంచేలా అజయ్ సేథ్.. పెద్ద ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు ప్రకటించే అవకాశాలున్నాయి.
దేబాశీష్ పండా (ఆర్థిక సేవల కార్యదర్శి)
1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పండా.. బ్యాంకింగ్ రంగ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. వచ్చే బడ్జెట్‌లో ఈయనపై మరిన్ని బాధ్యతలున్నాయి. ఓవైపు బ్యాంక్‌లను పటిష్ఠ స్థితిలో ఉంచుతూనే.. మరోవైపు ఒత్తిడికి గురైన పలు రంగాలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా ద్రవ్యాన్ని అందించాల్సిన పని ఈయనదే.
తుహిన్ కాంత పాండే(పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి)
ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోకపోయినప్పటికీ.. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా విక్రయంలో తుహిన్ కాంత పాండే కీలక పాత్ర పోషించారు. గురువారం ఎయిర్ ఇండియాను అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించడంతో ఈ సంస్థ ప్రైవేటీకరణ 100శాతం పూర్తయినట్లయింది. ప్రస్తుత బడ్జెట్‌లో మరిన్ని ప్రాజెక్టులను పాండే ప్రకటించే అవకాశముంది. ముఖ్యంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ ప్రకటన దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచేందుకు మరిన్ని ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటీకరించడంలో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : Union Budget 2022: ఆశల పల్లకిలో సామాన్యులు.. నిర్మలమ్మ వరాలిచ్చేనా?